చిత్తూరు జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పింపిణీ చేసే పౌష్టికాహారం కోసం ఇచ్చిన కిట్‌లోని ఎండు ఖర్జూరం ప్యాకెట్‌లో పాము కళేబరం కనిపించడం కలకలంరేపింది. బంగారుపాళ్యం మండలంలోని జంబువారిపల్లె పంచాయతీ శాంతినగర్‌లోని అంగన్‌వాడీ కేంద్ర పరిధిలో గర్భిణులకు ఈ నెల 4న ప్రభుత్వం సరఫరా చేసిన పౌష్టికాహారంలో ఎండు ఖర్జూరాలు ఉన్నాయి. గర్భిణి మానస తనకు ఇచ్చిన ప్యాకెట్ తీసుకుని శ్రీమంతం నిర్వహించుకునేందుకు మండలంలోని వేసనపల్లెలోని తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ మానస ప్యాకెట్ విప్పి చూడగా అందులో పాము కళేబరం ఉండటాన్ని గుర్తించి అవాక్కైంది. వెంటనే ఈ విషయాన్ని అంగన్‌వాడీ సూపర్‌వైజర్ ద్వారా సీడీపీవో వాణిశ్రీదేవికి సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై స్పందించిన ఆమె.. పాము కళేబరం ఉన్న మాట వాస్తవమేనని, విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించామన్నారు. మానసకు మరో ప్యాకెట్ ఇవ్వాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించాని సీడీపీవో తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలకు పోషకాహార కిట్‌ను అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో ప్రభుత్వం సరఫరా చేసిన పాల ప్యాకెట్లపై కూడా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. పాల ప్యాకెట్‌లు ఉబ్బిపోవడం చర్చనీయాంశం అయ్యింది.