ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రెండో రోజు సీఐడీ విచారణ ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 6 గంటల పాటు లోకేశ్‌ను సీఐడీ అధికారులు విచారించారు. అయితే.. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేశ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో.. హైకోర్టు ఒక్క రోజే విచారణకు హాజరవమని చెప్పిందని గుర్తు చేసిన లోకేష్.. సీఐడీ అడిగినందుకు రెండో రోజు కూడా హాజరయ్యానని తెలిపారు. సుమారు 6 గంటల పాటు తనను ప్రశ్నించారని చెప్పుకొచ్చారు. అయితే.. విచారణలో నిన్నటి ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారని తెలిపారు లోకేష్. కొత్తగా ఎలాంటి ఆధారాలు చూపలేదన్నారు. ఈరోజు సుమారు 45 ప్రశ్నలు అడిగితే... అందులో ఒకటి రెండు తప్ప అన్నీ నిన్నటి ప్రశ్నలేనని లోకేష్ చెప్పుకొచ్చారు.
అయితే.. తను చేపట్టిన శాఖకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారని లోకేష్ చెప్పుకొచ్చారు. దానిపై తనకు అవగాహన లేదని చెప్పినట్టు వివరించారు. నారా భువనేశ్వరి ఐటీ రిటర్న్ పేపర్లు ముందు పెట్టి ప్రశ్నలు అడిగారన్న లోకేష్... తన తల్లి డాక్యుమెంట్స్ ఎలా అడుగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని చాలా సీరియస్‍గా తీసుకుంటామన్నారు. కాగా.. మళ్లీ విచారణకు రమ్మని చెప్పలేదని స్పష్టం చేశారు లోకేష్. రెండు రోజుల పాటు తన సమయం వృథా చేశారని మండిపడ్డారు. అయితే.. విచారణ సమయంలో.. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి నాలుగైదు ప్రశ్నలు అడిగారని లోకేష్ చెప్పుకొచ్చారన్నారు. రెండు రోజుల్లో తనకు సంబంధించిన ఆధారాలు ఏవీ చూపలేదని పేర్కొన్నారు. వ్యవస్థలను ప్రభుత్వం మేనేజ్ చేస్తుందని ఆరోపించారు. చంద్రబాబును ప్రభుత్వం 32 రోజులు రిమాండ్‍లో పెట్టిందన్న లోకేష్.. ఇది కక్ష సాధింపు కాక మరేంటని ప్రశ్నించారు. ఇద్దరు రెడ్లపై ఎఫ్ఐఆర్ ఎందుకు లేదని నిలదీశారు. సంతకాలు పెట్టిన ఇద్దరిని ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చలేదన్నారు.
స్కిల్ కేసులో సంతకాలు పెట్టిన ఇద్దరు అధికారులను ఎందుకు విచారించట్లేదని లోకేష్ ప్రశ్నించారు. ప్రేమ్ చంద్రారెడ్డి, అజేయ కల్లంను ఎందుకు విచారించట్లేదని నిలదీశారు. ప్రేమ్ చంద్రారెడ్డి గుజరాత్‍లో పర్యటించి రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. లంచ్‍కు ముందు బాహుబలి సినిమా చూపించారని తెలిపారు. హెరిటేజ్ కొనుగోలు చేసిన తొమ్మిది ఎకరాలు గూగుల్ ఎర్త్‌లో చూపించారన్నారు. ఐఆర్ఆరర్ వల్ల హెరిటేజ్ భూములు కోల్పోయినట్లు చూపించారు. ఎఫ్ఐఆర్లో తనకు, తన కుటుంబ సభ్యులకు ఎలాంటి పాత్ర లేదని చెప్పుకొచ్చారు. పదేళ్లుగా కుటుంబ సభ్యుల ఆస్తులు ప్రజల ముందుంచుతున్నానని చెప్పుకొచ్చారు లోకేష్.
ఏపీలో అత్యధికంగా టాక్స్ కడుతున్న అమర్ రాజా సంస్థను ప్రభుత్వం తరిమికొట్టిందని లోకేష్ ఆరోపించారు. తెలంగాణలో రూ.9500 కోట్లు పెట్టుబడి పెట్టిందని.. అదే అమర్ రాజా ఉంటే చిత్తూరు యువకులకు ఉద్యోగాలు వచ్చేవన్నారు. లింగనమేని రమేష్‍కు రెంటెల్ అడ్వాన్స్ రూ.27 లక్షలు కట్టారని.. అందుకు సంబంధించి ఐటీ రిటర్న్‌ల్లో లేదని చెప్పినట్టు పేర్కొన్నారు. ఐటీ రిటర్న్‌లకు సంబంధించి ఆడిటర్‌ను అడగాలని చెప్పానని.. ఇంట్లో ఉండి అద్దె చెల్లిస్తే క్విడ్ ప్రోకో ఎలా అవుతుందని లోకష్ అడిగారు.