టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండో రోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఇవాళ కూడా విచారణ కొనసాగుతోంది. బుధవారం ఐదు నిమిషాలు ముందే తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి విచారణ ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు విచారణ కొనసాగనుంది. న్యాయవాది గింజుపల్లి సుబ్బారావుతో కలిసి లోకేష్.. సీఐడీ విచారణకు హాజరయ్యారు. మంగళవారం విచారణ ముగిశాక మళ్లీ 41A నోటీసు జారీ చేసిన సీఐడీ.. ఇవాళ కూడా విచారణకు పిలిచింది. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కూడా సీఐడీ విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన వెంట లాయర్ కూడా ఉన్నారు.
మరోవైపు లోకేష్‌ను తోలిరోజు విచారణలో మొత్తం 50 ప్రశ్నలు అడిగారని.. వాటిలో 49 ప్రశ్నలు ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేనివేనని లోకేష్ చెప్పుకొచ్చారు.ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేని అంశాలపై సీఐడీ అధికారులు తనను ప్రశ్నించారన్నారు. తాను లాయర్లతో సంప్రదించేందుకు ఢిల్లీ వెళ్లాల్సి ఉందని.. ఆలస్యమైనా సరే మిగతా ప్రశ్నలు అడగాలని తాను సీఐడీ అధికారుల్ని కోరానన్నారు. ఏం చేస్తుంటారు? హెరిటేజ్‌లో పని చేసినప్పుడు హోదా ఏంటి? ప్రభుత్వంలో ఏ బాధ్యతలు నిర్వహించారు? ఇటువంటి గూగుల్‌లో దొరికేవన్నీ తనని విచారణాధికారులు అడిగారన్నారు లోకేష్. తన ముందు ఈ కేసుకి సంబంధించిన ఎలాంటి ఆధారాలు పెట్టలేదన్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షమైనా, ప్రజలనైనా కక్ష సాధించడం అలవాటుగా మారిందన్నారు. పోలవరం ఎందుకు పూర్తి చేయలేదని, యువతకి ఉద్యోగాలు ఎందుకు కల్పించలేదని నిలదీసినందుకే ఆధారాలు లేని కేసులో అక్రమ అరెస్టు చేసి చంద్రబాబుని జైలులో వేశారన్నారు.
ఇది ముమ్మాటికీ కక్షసాధింపు చర్యేనన్నారు. తాను యువగళం పాదయాత్ర ద్వారా అరాచక సర్కారుపై ప్రజల్ని చైతన్యపరుస్తుంటే...ఇదిగో ఇలా తప్పుడు కేసుతో యువగళం ఆగిపోయేలా చేశారని మండిపడ్డారు. ఈ తప్పుడు కేసులన్నీ ప్రజల్లో ఉంటోన్న తెలుగుదేశం పార్టీని కట్టడి చేయడానికి నేను, చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే కుట్రల్లో భాగమేనన్నారు. తాను లండన్‌లో ఉన్నప్పుడు తనకి తెలియకుండా చంద్రబాబు అరెస్టు జరిగిందని జగన్ అంటున్నారని, ఏసీబీ-సీఐడీ సీఎం కింద పనిచేస్తాయనే కనీస అవగాహనలేని పిచ్చి జగన్ డీజీపీ దగ్గర పాఠాలు నేర్చుకోవాలన్నారు.తప్పుచేయనప్పుడు తానెందుకు భయపడాలని ప్రశ్నించారు.