ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు బంరాఫర్ ప్రకటించింది. దసరా ప్రత్యేక బస్సుల్లో టికెట్ ఛార్జీల్లో పది శాతం రాయితీ ఇస్తున్నామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. గతంలో దసరా ప్రత్యేక బస్సులకు యాభై శాతం అదనపు ఛార్జీలు వసూలు చేసేవారని.. రెండేళ్లుగా ఆ భారాన్ని లేకుండా చేశామన్నారు. గతేడాది రానుపోను రెండువైపులా టికెట్ తీసుకుంటేనే పది శాతం రాయితీ వర్తించేదని.. ఈసారి ఏ ఒక్కవైపు టికెట్ తీసుకున్నా రాయితీ వర్తిస్తుందని వెల్లడించారు. అంటే రానుపోను చార్జీల్లో పది శాతం చొప్పున 20 శాతం రాయితీ కల్పిస్తున్నామని వివరించారు. రాయితీలు కల్పించి ఓఆర్ పెంచి ఆదాయ పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పండగ కోసం ప్రత్యేకంగా 5500 బస్సులను నడుపుతామని తెలిపారు.
త్వరలో 1500 డీజిల్ ఇంజిన్ బస్సులు, వెయ్యి ఎలక్ట్రికల్ బస్సులు త్వరలో రోడ్డెక్కుతాయని వివరించారు. ఇకపై ఏటా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సులు కొనాలనేది తమ ప్రణాళిక అన్నారు. తమ ఉద్యోగులకు హయ్యర్ పింఛనును అమలు చేయనున్నామని.. తొలుత 8500 మందికి దీన్ని వర్తింపజేస్తామన్నారు. సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పీఎఫ్ సొమ్ము సకాలంలో చెల్లించడం వల్ల భారీగా పెన్షన్ అందుకోబోతున్నారని చెప్పారు. అలాగే ప్రమాద బీమా రూ.85 లక్షలు వర్తించేలా రాష్ట్ర రవాణా శాఖా మంత్రి సమక్షంలో ఎస్‌బీఐతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. గతంలో ప్రమాద బీమా రూ.45 లక్షలు ఉండేదన్నారు. అలాగే పీఎఫ్ బకాయిలు సకాలంలో కేంద్రం చెల్లించటం వల్ల సిబ్బందికి కేంద్రం హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం రూ.3 వేలు నుంచి రూ.4 వేలు పెన్షన్ వచ్చే కేడర్‌లో ఉన్న వారికి ఇకపై రూ.25 వేలు పెన్షన్, రూ.5 నుంచి 6 వేలు ఉన్న వారికి రూ.30 వేలు నుంచి రూ.50 వేలు వరకు పెన్షన్ వస్తుందన్నారు.