ఇటీవలి కాలంలో కండలు తిరిగిన బాడీ బిల్డర్లు, నిత్యం జిమ్ చేసేవారు అకస్మాత్తుగా కూలిపోయి చనిపోయిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. అయితే వారేమో వృద్ధులు కాదు. యువకులు, మధ్య వయస్సు ఉన్నవారే మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నిత్యం వ్యాయామాలు, జిమ్, ప్రత్యేకంగా డైట్.. ఇలా ఆరోగ్యం పట్ల కఠినంగా ఉండే వారే పిట్టల్లా రాలిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా బాడీ బిల్డర్, మిస్టర్ తమిళనాడు విజేత యోగేష్ కూడా అదే విధంగా చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అయితే ఎప్పటిలాగే మంగళవారం కూడా జిమ్కు వెళ్లిన యోగేష్.. అక్కడికి వచ్చిన వారికి ట్రైనింగ్ ఇచ్చారు. ఇక ఇంటికి వెళ్లేందుకు ఒకసారి బాత్రూమ్కు వెళ్లారు. అయితే బాత్‌రూమ్‌కు వెళ్లిన యోగేష్ ఎంతకూ బయటికి రాలేదు. దీంతో అక్కడ జిమ్‌కు వచ్చిన కొందరు యువకులకు అనుమానం వచ్చింది. వెంటనే బాత్రూమ్‌లోకి వెళ్లి చూడగా.. కింద పడి ఉన్నాడు.
వెంటనే హుటాహుటిన స్థానికంగా ఉన్న కిల్పౌక్ ప్రభుత్వ ఆస్పత్రికి యోగేష్‌ను తరలించారు. అయితే యోగేష్‌ను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే అతడు చనిపోయినట్లు ప్రకటించారు. గుండెపోటు రావడంతోనే యోగేష్ మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. పెళ్లైన తర్వాత బాడీ బిల్డింగ్ పోటీలు, ఇతర ఛాంపియన్‌షిప్‌ల నుంచి తప్పుకున్న యోగేష్.. ఒక్కసారిగా భారీగా బరువులు ఎత్తడం వల్లే ఇలా జరిగిందని వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. యోగేష్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది. యోగేష్‌కు భార్య, ఒక కూతురు ఉన్నారు. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చే యోగేష్.. ఈ విధంగా చనిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చెన్నైలోని అంబత్తూరు మేనంపేడులోని మహాత్మాగాంధీ కాలనీలో యోగేష్ నివసిస్తున్నారు. ముందు నుంచి బాడీ బిల్డర్‌గా ఉన్న యోగేష్.. కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొని అనేక పతకాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో బాడీ బిల్డింగ్ పోటీల్లో ‘మిస్టర్ తమిళనాడు’ అవార్డును కూడా అందుకున్నారు. ఇక 2021లో వైష్ణవి అనే యువతిని పెళ్లి చేసుకున్న యోగేష్.. బాడీ బిల్డింగ్ పోటీల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత నుంచి స్థానికంగా ఉంటున్న ఓ జిమ్లో ట్రైనర్గా పని చేస్తున్నారు.