మహిళలకు రక్షణలేని ప్రభుత్వమైన బీజేపీకి 2024 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఒక్క ఓటు కూడా వేయవద్దని సీపీఎం కేంద్రకమిటీ సభ్యురాలు మరియం థావలే పిలుపునిచ్చారు. అసమానతలు లేని అభివృద్ధి అనే నినాదంతో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం తిరుపతిలో రాష్ట్ర మహిళా సదస్సు జరిగింది. ఈ సమావేశంలో థావలే ప్రసంగిస్తూ.... దేశంలో అధిక భాగం ఆకలితో అలమటిస్తున్నారని, గతంలో 107వ స్థానంలో ఉన్న ఆకలి సూచి ఇప్పుడు 111వ స్థానానికి దిగజారిందని తెలిపారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత శతకోటీశ్వరులకు రూ. 15లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని ఆరోపించారు. అదే ఒక్క రైతుకైనా రుణమాఫీ చేశారా అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో మహిళలపై దాడులు అధికమయ్యాయని విమర్శించారు.