ఆంధ్రప్రదేశ్‌లో మత్స్య రంగ అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారం అందించడంతోపాటు అధిక నిధులను కేటాయిస్తోందని, PMMSY పథకం కింద రూ.20 వేల కోట్లతో మత్స్యకార రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని కేంద్ర మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల పేర్కొన్నారు. ఇప్పటికే రూ.2500కోట్ల ప్రాజెక్టులను మంజూరు చేశామని, అయినా మరో రెండు ప్రాజెక్టులను మంజూరు చేయాలని ప్రజాప్రతినిధులు కోరారని చెప్పారు. సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు మీదుగా తాను జలమార్గంలో ప్రయాణిస్తూ ఏపీలోని కృష్ణపట్నం పోర్టుకు ప్రవేశించినట్టు వివరించారు. ఈ సాగర్ పరిక్రమ పర్యటన ద్వారా తీరప్రాంతాల్లో హార్బర్ల స్థితిగతులు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, మత్స్యకారుల జీవన విధానం, మౌలిక వసతుల కల్పనపై నిశితంగా పరిశీలించే అవకాశం కలిగిందన్నారు. దేశంలో మూడు కోట్ల మత్స్యకార కుటుంబాలు, 8వేల కి.మీల తీర ప్రాంతం ఉందని ఒక్క ఏపీలోనే 30శాతం మత్స్యసంపద ఉత్పత్తి అవుతోందని తెలిపారు. మత్స్య ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేలా రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎంపీలు బీద మస్తాన్‌రావు, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు పాల్గొన్నారు.