హమాస్‌పై ఇజ్రాయేల్ ప్రతీకార దాడులతో వణికిపోతున్న గాజా నగరంలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం ఓ ఆసుపత్రిలో పేలుడు సంభవించి కనీసం 500 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఇజ్రాయేల్, హమాస్ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. పేలుడుకు ఇజ్రాయేల్ వైమానిక దాడులే కారణమని హమాస్ ఆరోపించగా... అది ఇస్లామిక్ జిహాదీల చర్యేనని టెల్ అవీవ్ ప్రత్యారోపణలు చేసింది. గాజా నగరంలోని అల్ అహ్లి ఆసుపత్రిలో జరిగిన ఈ దుర్ఘటన దశాబ్దాలుగా జరుగుతున్న ఇజ్రాయేల్, పాలస్తీనా ఘర్షణల్లో అత్యంత ఘోరమైంది.
‘గాజాలోని ఆసుపత్రిలో పేలుడుకు ఇస్లామిక్ జిహాద్ కారణమని విశ్వసనీయ వర్గాల ద్వారా లభించిన సమాచారం సూచించింది’ అని ఇజ్రాయేల్ సైన్యం తెలిపింది. ఆసుపత్రికి సమీపంలో వైమానిక కార్యకలాపాలు, ఉపయోగించిన రాకెట్లు వాటి దాని పరికరాలతో సరిపోలడం లేదని వ్యాఖ్యానించింది. మరోవైపు, హమాస్ మిత్రపక్షం ఇస్లామిక్ జిహాద్ సైతం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘గాజాలోని బాప్టిస్ట్ అరబ్ నేషనల్ హాస్పిటల్‌పై బాంబు దాడి చేసిన శత్రువు.. అబద్ధపు ప్రకటనతో పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్‌పై నిందలు వేసి క్రూరమైన మారణకాండకు తన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది.’ అని మండిపడింది.
కాగా, ఉత్తర గాజాలో ఉన్న ప్రజలంతా దక్షిణ గాజాకు వెళ్లాలని ఆదేశించిన ఇజ్రాయేల్ అక్కడా బాంబులతో విరుచుకుపడుతోంది. దక్షిణ గాజాపై మంగళవారం చేసిన దాడుల్లో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. వారిలో ఉత్తర గాజా నుంచి వచ్చి శరణార్ధులు ఉన్నారు. రఫా, ఖాన్ యూనిస్ పట్టణాల శివార్లలో వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల కారణంగా రఫాలో 27 మంది, ఖాన్ యూనిస్‌లో 30 మంది మరణించారని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఇటు లెబనాన్ సరిహద్దులోనూ ఇజ్రాయేల్, హెజ్‌బొల్లా మధ్య ఘర్షణ కొనసాగింది. అత్యంత దుర్భర స్థితిలో ఉన్న గాజాకు సాయం అందించడానికి దౌత్యమార్గాల్లో ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. గాజాకు మానవతా సాయం అందించేందుకు సహకరించాలని కోరుతూ భద్రతా మండలిలో రష్యా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. బుధవారం ఇజ్రాయేల్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ పర్యటించనున్నారు.
జోర్దాన్‌లోనూ ఆయన పర్యటించి, అరబ్ నేతలతో సమావేశమవుతారు. హమాస్‌తో ఇజ్రాయెల్ పోరు తీవ్రమవుతున్న నేపథ్యంలో తమ సైనికులను అమెరికా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా ఇజ్రాయేల్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని 2 వేల మంది సైనికులను పెంటగాన్ ఆదేశించినట్లు ఓ సైనికాధికారి తెలిపారు. jకాగా, ఇజ్రాయేల్, హమాస్‌ల మధ్య దాడుల్లో ఇప్పటివరకు ఇరువైపులా దాదాపు 4వేల మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గాయపడ్డారు.