తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో నేడు గరుడసేవ జరగనుంది. తిరుమలకు అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్ తెలిపారు. విశేషంగా విచ్చేసే భక్తులకు శ్రీవారి మూలమూర్తి దర్శనం, వాహనసేవ కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. గ్యాలరీలు నిండిపోయి ఇన్నర్ రింగ్ రోడ్డులో వేచి ఉన్న భక్తులను మాడవీధుల్లోని కార్నర్లలో ప్రత్యేక క్యూలైన్ల ద్వారా అనుమతించి గరుడ వాహనం దర్శనం కల్పిస్తామని చెప్పారు.
రాంభగీచా ప్రధాన మార్గం నుంచి వాహన మండపం వరకు వీఐపీలందరూ నడిచి వెళ్లాల్సి ఉంటుందన్నారు. వీరి కోసం బ్యాటరీ కార్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గరుడసేవ రోజున వీఐపీలు కూడా సహకరించాలని ఆయన కోరారు. అక్టోబరు 19న ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించామని, ఉద్యోగుల కోసం గ్యాలరీలు ఏర్పాటు చేశామని, అన్నప్రసాద వితరణ కోసం విస్తృత ఏర్పాట్లు చేపట్టామని, మొబైల్, లగేజీ డిపాజిట్, డెలివరీ కోసం లగేజీ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవకు విశేషంగా విచ్చేసే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ క్యాటరింగ్ ప్రత్యేకాధికారి జిఎల్ఎన్శాస్త్రి తెలిపారు. గరుడ సేవ దర్శనం కోసం బుధవారం రాత్రి నుండి గ్యాలరీల్లో భక్తులు వేచి ఉంటారని వీరికి వేడిగా పాలు అందిస్తామని తెలిపారు. గురువారం ఉదయం 5 గంటల నుండి అన్నప్రసాదాల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. ఉదయం 5 గంటలకు కాఫీ, పాలు, ఉదయం 6.30 నుండి 10 గంటల వరకు ఉప్మా లేదా పొంగలి, ఉదయం 11 నుంచి 1 గంట వరకు 2.75 లక్షల మందికి మజ్జిగ, మధ్యాహ్నం 11 నుంచి 3 గంటల వరకు 14 రకాల కూరగాయలతో బిసిబేలా బాత్, చక్కెర పొంగలి అందిస్తామన్నారు.
అదే విధంగా మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3 గంటల వరకు పులిహోర ప్యాకెట్లు, సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల వరకు సుండలు, పాలు, కాఫీ అందజేస్తామని తెలిపారు. 12 వాహనాలు, 150 ట్రాలీలు, 363 మంది అదనపు సిబ్బంది, 830 మంది శ్రీవారి సేవకులతో గ్యాలరీల్లో భక్తులకు అన్నప్రసాదాలు అందజేస్తామన్నారు. అదే విధంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు వెంగమాంబ అన్న ప్రసాదం భవనంలో భక్తులకు అన్నప్రసాదాలు అందజేస్తామన్నారు.