భారీ అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకోడానికి ఓ వ్యక్తి పెను సాహసం చేశాడు. మంటలు చుట్టుమట్టడంతో నాలుగు అంతస్తుల భవనం పై నుంచి అమాంతం దూకేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడ్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన బెంగళూరులోని కోరమంగల ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. భవనం పై అంతస్తులో భారీ పేలుళ్లతో మంటలు ఎగిసిపడుతుండగా.. ఓ వ్యక్తి కిందికి దూకడం ఈ వీడియోలో రికార్డయ్యింది.
ఓ హుక్కా పబ్‌లో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగంతస్తుల భవనంలోని పై ఫ్లోర్‌లో పబ్ నిర్వహిస్తున్నారు. ఈ పబ్‌లో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి. దీంతో ప్రమాదం తప్పించుకునేందుకు ఓ వ్యక్తి అక్కడి నుంచి దూకేశాడు. మంటలు తనవైపు రావడాన్ని గమనించిన అతడు.. ఒక్కసారిగా దూకేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మరో వ్యక్తి కూడా గాయపడగా.. ఇద్దరు క్షతగాత్రులు ప్రస్తుతం ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీని గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు కింది అంతస్తులకు వ్యాపించకుండా అదుపులోకి తీసుకొచ్చారు.
పబ్‌లో ఉన్న ఆరు సిలిండర్లు పేలిపోవడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఒక దాని తర్వాత మరొకటి పేలడంతో చుట్టుపక్కల నివాసాల వాళ్లు భయభ్రాంతులకు గురయ్యారు. సిలిండర్లు పెద్ద సంఖ్యలో పై అంతస్తులో ఉంచినట్టు పోలీసులు గుర్తించారు. మంటలు ఆర్పడానికి మొత్తం ఎనిమిది ఫైర్ ఇంజిన్లను ఘటనా స్థలికి పంపామని, అగ్ని ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని అగ్నిమాపక విభాగం అధికారి తెలిపారు. ఘటన సమయంలో అక్కడ కస్టమర్లు ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రాణనష్టం తప్పిందని పోలీసులు చెప్పారు.