వచ్చే ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ.. వాటికి సెమీ ఫైనల్స్‌గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలోనే అటు ప్రాంతీయ పార్టీలతోపాటు జాతీయ పార్టీలు కూడా విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న ఆయా రాష్ట్రాల్లో పండగలు, పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గిపోతుందేమోనని కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు పార్టీలు, అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్ పోలింగ్ తేదీని మార్చాలని తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
ఛత్తీస్‌గఢ్ ఎన్నికల పోలింగ్ తేదీని మార్చాలని అభ్యర్థిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి బుధవారం లేఖ రాసింది. ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 7 వ తేదీన తొలి విడత, నవంబర్ 17 వ తేదీన రెండో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే నవంబర్ 17 వ తేదీన ఛత్ పండగ ఉన్న నేపథ్యంలో ఆ రోజు జరిగే ఎన్నికల తేదీని మార్చాలని సీఈసీని ఆప్ కోరింది. ఈ మేరకు ఒక లేఖ కూడా రాసింది. మంగళవారం రోజు బీజేపీ ఉపాధ్యక్షుడు, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్ కూడా ఛత్ పండుగ దృష్ట్యా నవంబర్ 17 న జరగాల్సిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశను వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని కోరడం విశేషం.
ఈ ఏడాది నవంబర్ 17 వ తేదీ నుంచి నవంబర్ 20 వ తేదీ వరకు ఛత్ పండుగ నిర్వహించనున్నారు. పండగ నేపథ్యంలో ఓటింగ్ వేసేందుకు ప్రజలు ఆసక్తి చూపరని పార్టీలు భావిస్తున్నాయి. అదే జరిగితే ఓటింగ్ శాతం పడిపోయి.. తమకు ఎక్కడ నష్టం వస్తుందోనని భావించి.. కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు చేస్తున్నాయి. ఛత్ పండుగను ఛత్తీస్‌గఢ్ ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. దీంతో పోలింగ్ తేదీని మార్చాలనే డిమాండ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 90 మంది సభ్యులు ఉన్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 7న తొలి విడత పోలింగ్, 17న రెండో విడత పోలింగ్ జరగనున్నాయి. డిసెంబర్ 3 వ తేదీన 5 రాష్ట్రాలతో కలిపి ఫలితాలు వెల్లడికానున్నాయి.
అయితే ఇప్పటికే రాజస్థాన్‌లో ఎన్నికల పోలింగ్ తేదీని నవంబర్ 23 వ తేదీ నుంచి 25 వ తేదీకి మార్చారు. నవంబర్ 23 వ తేదీన స్థానికంగా పండగ, మంచి రోజు ఉండటంతో ఆ రోజే ఏకంగా రాజస్థాన్ వ్యాప్తంగా 50 వేలకు పైగా పెళ్లిళ్లు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ రోజు ఎన్నికలు నిర్వహిస్తే.. అటు పెళ్లిళ్లు, ఇటు పోలింగ్ రెండింటికీ ఇబ్బంది కలుగుతుందన్న వాదనలు వినిపించిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాజస్థాన్ ఎన్నికల పోలింగ్ తేదీని నవంబర్ 25 వ తేదీకి మార్చింది.