దేశంలో తొలిసారి ర్యాపిడ్ రైలు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ర్యాపిడ్‌ఎక్స్) పేరుతో ప్రారంభించే ఈ ప్రాంతీయ రైళ్లకు ‘నమో భారత్’గా కేంద్ర ప్రభుత్వం నామకరణం చేసింది. వందేభారత్ ఎక్స్ప్రెస్ తర్వాత దేశంలో పట్టాలెక్కుతున్న మరో హైస్పీడ్ రైలు ఇది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (అక్టోబర్ 20న) ప్రారంభించనున్నారు. తొలిదశలో ఢిల్లీ- ఘజియాబాద్ మార్గంలో సాహిబాబాద్- దుహై డిపో మధ్య ఈ రైలును నడపనున్నారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలులో అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అయితే, ఈ రైలుకు నమో భారత్ పేరు పెట్టడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. నమో స్టేడియం.. ఇప్పుడు నమో రైళ్లు.. అతని స్వీయ వ్యామోహానికి పరిమితి లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఎద్దేవా చేశారు. అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియానికి మోదీ పేరు పెట్టిన విషయం తెలిసిందే.
ఇక, పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ సౌకర్యం కలిగిన నమో భారత్ రైళ్లలో ఇరువైపులా 2x2 లేఅవుట్లో సీట్లు, నిలబడేందుకు విశాలమైన ప్రదేశం, లగేజ్ ర్యాక్లు ఉంటాయి. సీసీటీవీలు, ఎమర్జెన్సీ డోర్ ఓపెనింగ్ వ్యవస్థ, ఛార్జింగ్ పాయింట్లు వంటి అధునాతన సౌకర్యాలు కల్పించారు. ఈ రైళ్లు ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు ప్రతి 15 నిమిషాలకు ఒక సర్వీసు ఉంటుంది. ఈ రైళ్ల గరిష్ఠ వేగం 160 కి.మీ. అయినా.. అంతకంటే కొంచెం తక్కువ వేగంతోనే నడపునున్నట్టు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌ను రూ. 30,000 కోట్లకుపైగా వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. ఘజియాబాద్, మురాద్‌నగర్, మోదీనగర్ కేంద్రాల ద్వారా ఢిల్లీ నుంచి మీరట్‌కు ఒక గంట కంటే తక్కువ ప్రయాణ సమయంతో ఇది కలుపుతుంది అని పీఎంఓ తెలిపింది. కాగా, ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ఆర్ఆర్‌టీఎస్ సేవలు జూన్ 2025 నాటికి అందుబాటులోకి రానున్నాయి.