విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారి దర్శనమిస్తారు. అమ్మవారి అలంకారాలలో లలితా త్రిపుర సుందరీ దేవికి ప్రత్యేకత ఉంది. త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉన్నది కాబట్టి త్రిపురసుందరి అని పిలవబడుతోంది. శ్రీదేవి యే శ్రీ చక్ర అధిష్టాన శక్తి గా పంచదశాక్షరీ మహా మంత్రాధి దేవతగా తనను కొలిచే భక్తుల్ని ఉపాసకుల్ని అనుగ్రహిస్తోంది. లక్ష్మీ దేవి , సరస్వతిదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా చిరుమందహాసంతో భక్తిపావనాన్ని చిందే చెరుకుగడను చేతబట్టుకుని శివుని వృక్ష స్థలం పై కూర్చుని దేవి దర్శనమిస్తుంది. దర్శన సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడిగా, అమ్మవారు త్రిపురసందరీదేవిగా భక్తుల చేత పూజలందుకుంటారు.ఇవాళ కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూ లైన్‌లన్నీ భక్తులతో నిండిపోయాయి.