ఏపీ రాజకీయాల్లో మరో కీలక సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబును కలిసిన తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. బయటకు వచ్చి టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన వారాహి విజయ యాత్రలో కూడా పొత్తు అంశాన్ని ప్రస్తావిస్తూనే వస్తున్నారు. జనసేన, టీడీపీ కార్యకర్తలు కూడా కలిసిమెలిసి నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పొత్తులో మరో కీలక ముందడుగు పడింది. టీడీపీ- జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ తొలి సమావేశం సోమవారం (అక్టోబర్ 23) మధ్యాహ్నం 2 గంటలకు రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఇక వచ్చే ఎన్నికల కోసం ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారానే ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించ నున్నారు.ప్రజాసమ స్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యా చరణ, తాజా రాజకీయ పరిణామాలు, ఇరుపార్టీల సమన్వయంపై ఇక్కడ చర్చించనున్నారు .మంజీరా ఇంటర్నేషన్ హోటల్‌లో సమావేశం ఉండవచ్చని సమాచారం.. అయితే అధికారికంగా వేదికపై క్లారిటీ రావాల్సి ఉంది.
ముఖ్యమంత్రి పదవి కన్నా రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు ముఖ్యం అంటున్నారు పవన్ కళ్యాణ్. వైఎస్సార్‌సీపీని గద్దె దించడమే లక్ష్యమన్నారు. ఆ క్రమంలో సీఎం పదవి వస్తే స్వీకరిస్తా.. సీఎం పదవికి విముఖంగా లేను అన్నారు. వైఎస్సార్2సీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా పార్టీ పదవులు పొందినవారికి నియామకపత్రాలు అందించిన అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని దించి జనసేన-టీడీపీ ప్రభుత్వం ఏర్పడేలా ప్రతి కార్యకర్తా బలంగా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. కొందరు 2014లో పార్టీతో ఉండి, తర్వాత వెళ్లిపోయారని.. పదవులు, గెలుపులు కోరుకునేవారు ముఖ్యం కాదన్నారు. అప్పటి నుంచి ఏ పదవి ఆశించకుండా తనతో ప్రయాణించిన వారందరీకి ధన్యవాదాలు తెలిపరు. 2024లో వైఎస్సార్‌సీపీని గద్దె దింపేందుకు అంతా కలిసి పనిచేయాలన్నారు. టీడీపీతో పొత్తుపై ఇబ్బందులేమీ లేవని తనకు తెలుసు అన్నారు.
ప్రజాభిప్రాయాన్ని, పార్టీలో క్రియాశీలకంగా ఉండేవారి అభిప్రాయాన్ని తెలుసుకున్నాకే పొత్తు నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖలో పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయన్నారు జనసేనాని. టోఫెల్ పరీక్ష, ఐబీ సిలబస్, అందుకు శిక్షణ పేరుతో రూ.వందల కోట్ల అక్రమాలు జరుగుతున్నాయన్నారు. తప్పులను బయటపెడుతున్నా ప్రభుత్వం సరిదిద్దుకోవడం లేదని జనసేన తరఫున హెచ్చరిస్తున్నామన్నారు. టీడీపీ- జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విద్యా కుంభకోణాల బాధ్యులను జైలుకు పంపుతామన్నారు. తమ ప్రభుత్వంలో మొదట జైలుకెళ్లేది వారే అన్నారు.