కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం.. గ్రామ స్థాయి నుంచి ఎన్నికల ప్రణాళికను రూపొందించేందుకు సిద్ధం అయింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామాల స్థాయిలో ఉన్న ప్రజలందరికీ చేరువ చేసేలా ఒక పెద్ద డ్రైవ్ చేపట్టనుంది. ఆరు నెలల పాటు కొనసాగనున్న ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా గ్రామాల్లో ఉన్న సంక్షేమ పథకాల అర్హులను గుర్తించి వారికి అవి అందేలా ఒక భారీ కార్యక్రమానికి కేంద్రంలోని మోదీ సర్కార్ శ్రీకారం చుట్టనుంది. ఈ దీపావళి పండగ తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు బీజేపీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర పేరుతో ఈ మెగా డ్రైవ్‌ను దేశవ్యాప్తంగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పంగా పెట్టుకుంది. దేశంలోని 2.7 లక్షల గ్రామ పంచాయతీల్లో ఈ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను చేపట్టనున్నారు. ఈ మెగా డ్రైవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఎవరు అర్హులు అనేది గుర్తించి వారికి ఆ పథకాల్లో ఉన్న ప్రయోజనాలను అందించడమే ఈ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో పూర్తిగా అందేలా చూసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 నెలల లక్ష్యాన్ని నిర్దేశించినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర.. దీపావళి పండుగ తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపాయి.
ఇటీవల ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. వచ్చే 6 నెలల్లో ఆ పథకాలన్నీ గ్రామ స్థాయికి చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత జరిగిన కేంద్ర మంత్రవర్గ సమావేశంలో కూడా ఇదే అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మరింత కష్టపడి పని చేసి సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఇప్పటివరకు అదని లబ్ధిదారులకు వేగంగా చేరేలా చూడాలని కేంద్ర మంత్రులకు ప్రధాని సూచించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కోసం ప్రత్యేకంగా రథాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన, పోషణ్ అభియాన్, ఉజ్వల్ యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన వంటి పథకాలకు సంబంధించి అర్హులుగా ఉండి.. ఇప్పటివరకు నమోదు చేసుకోని.. వాటి ద్వారా లబ్ధి పొందని వారికి ఆ పథకాలు అందేలా చర్యలు తీసుకోనున్నారు. దీపావళి తర్వాతి నుంచి ప్రారంభం కానున్న ఈ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర 6 నెలలు కొనసాగనుంది. దీంతో వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మరోసారి అధికారాన్ని కట్టబెడుతుందని మోదీ సర్కార్ భావిస్తోంది.