విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మళ్లీ పోస్టర్లు కలకలం రేపాయి. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ వ్యతిరేకంగా నియోజకవర్గంలోని పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. ఎమ్మెల్యే టిడ్కో ఇళ్లు, ఆలయాల ఛైర్మన్ పోస్టులు, ఉద్యోగాలను ఎమ్మెల్యే అమ్ముకుంటున్నారని.. అన్నింట్లో 40 శాతం కమిషన్ తీసుకుంటున్నారంటూ గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లు వేశారు. అంతేకాకుండా బుక్ మై ఎమ్మెల్యే అంటూ వ్యంగ్యంగా ప్రకటనలు గుప్పించారు.
అయితే వీటిని గమనించిన ఎమ్మెల్యే అనుచరులు శనివారం తెల్లవారుజామున తొలగించారు. అయితే ఈ వ్యహారంపై అటు ఎమ్మెల్యే గానీ, ఆయన అనుచరులు గానీ ఇంకా స్పందించలేదు. 2019లో ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఆయన అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయన రాకను వైసీపీలోనే ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గతంలో కూడా ఇదేవిధంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌పై పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్ల వెనుక ఎవరు ఉన్నారో తెలియాల్సి ఉంది.
విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత పరిణామాలతో సీఎం జగన్‌ను కలిసి వైఎస్సార్‌సీపీకి మద్దతు పలికారు. అయితే నియోజకవర్గంలో వాసుపల్లి రాకను వైఎస్సార్‌సీపీలోని ఓ వర్గం వ్యతిరేకించింది. దీంతో అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య వార్ నడుస్తంది. గతంలో కూడా ఇలాగే కొన్ని ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. మళ్లీ ఇప్పుడు పోస్టర్లు అంటించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.