ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. విజయవాడ కేంద్రంగా త్వరలో రీజినల్ పాస్ పోర్ట్ కార్యాలయం అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ శివ హర్ష అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి అదనంగా విజయవాడ బందర్ రోడ్డులో రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు హర్ష. రీజనల్ పాస్‌పోర్టు సేవా కేంద్రానికి రోజుకు 2వేల అప్లికేషన్స్ వస్తున్నాయని.. కోవిడ్ తర్వాత పాస్‌పోర్ట్ అప్లికేషన్స్ ఎక్కువగా వస్తున్నాయి అన్నారు. అక్టోబర్ నెల వరకు 3 లక్షల పాస్ పోర్టులు జారీ చేశామన్నారు.
పోస్టల్, పోలీసు శాఖల భాగస్వామ్యంతో పాస్ పోర్టులు త్వరితగతిన అందజేస్తున్నామన్నారు. విజయవాడ రీజనల్ ఆఫీసు కేంద్రంగానే ఇక పై పాస్ పోర్ట్ ప్రింటింగ్ ప్రారంభమవుతుందన్నారు. విజయవాడలో ఆఫీసు ప్రారంభం కావడం వల్ల త్వరగా సేవలు అందుతాయన్నారు. మరో రెండు మూడు నెలల్లోనే రీజనల్ పాస్ పోర్టు కార్యాలయం ప్రారంభిస్తామన్నారు. గతం కంటే ప్రస్తుతం పాస్ పోర్టు సేవలు సులభతరం చేశామన్నారు. తక్కువ సమయంలోనే పాస్ పోర్టులు అందజేస్తున్నామని.. దయచేసి ఎవరూ ఫేక్ సైట్లు,బ్రోకర్లను నమ్మొద్దని కోరారు.