ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. పశ్చిమ మధ్య బంగాళాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సముద్రం మీదుగా కోస్తాపైకి తేమగాలులు వీచాయి. అలాగే తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అలాగే రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
గుంటూరు, బాపట్ల, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది.
అంతేకాదు శుక్రవారం రాష్ట్రంలో పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. అయితే రాత్రి ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. జంగమహేశ్వరపురంలో 18 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే అక్కడక్కడా ఉదయాన్నే మంచు కూడా కురుస్తోంది. ఈ విభిన్నమైన వాతావరణంతో జనాలు ఇబ్బందిపడుతున్నారు. పగలు ఎండ, రాత్రి, ఉదయం సమయంలో చలితో అల్లాడిపోతున్నారు.