దేశంలో కాలుష్యం, పెరుగుతున్న ఇంధన ధరలతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజా రవాణాలో కూడా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ బస్సులను ఆయా ప్రజా రవాణాలో ఉపయోగిస్తుండగా.. కేంద్రం కూడా రంగంలోకి దిగింది. మొత్తం 10 వేల ఎలక్ట్రిక్ బస్సుల్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే వారం 3 వేల బస్సులను సేకరించేందుకు టెండర్లు ఆహ్వానించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఈ 10 వేల ఎలక్ట్రిక్ బస్సుల్ని దేశవ్యాప్తంగా ఉన్న 169 నగరాల్లో అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ పథకానికి 'పీఎం ఈ-బస్ సేవ’ అని పేరు పెట్టింది. ఇందులో భాగంగా తొలుత 3 వేల బస్సుల్ని సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందు కోసం వచ్చే వారంలో 3 వేల ఈ-బస్సుల కోసం టెండర్లు పిలిచే అవకాశం ఉందని.. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి మనోజ్ జోషీ తాజాగా మీడియాకు తెలిపారు. 'పీఎం ఈ-బస్ సేవ’ పథకం కింద ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో అందుబాటులోకి తీసుకురావాలని ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం 169 నగరాల్లో 10 వేల బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో రాష్ట్రాలు కూడా భాగస్వాములుగా ఉంటాయని మనోజ్ జోషీ తెలిపారు.
ఈ 10 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలన్న నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రాలకు సమాచారం అందించారు. దీనిపై ప్రతిపాదనలు పంపేందుకు రాష్ట్రాలకు నెల రోజుల గడువు ఇచ్చారు. ఇందుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2 వేల బస్సులకు ప్రతిపాదన వచ్చిందని మనోజ్ జోషీ తెలిపారు. ఇతర రాష్ట్రాలు కూడా కేంద్రం పంపించిన ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తున్నందున ఖర్చు కూడా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో జీపీఎస్‌తో పాటు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉంటుందని వెల్లడించారు. 3 లక్షల నుంచి 40 లక్షల మధ్య జనాభా ఉన్న నగరాలు ఈ పీఎం ఈ-బస్ సేవ పథకం పరిధిలోకి రానున్నాయని తెలిపారు. ఆయా చోట్ల వచ్చే పదేళ్లపాటు ఈ-బస్ సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.