త్వరలో దేశంలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్ అసెంబ్లీకి కూడా పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే తాజాగా శుక్రవారం రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్.. ప్రజలకు 5 గ్యారెంటీలను ప్రకటించారు. ఇప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయం సాధిస్తే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని అశోక్ గెహ్లోత్ వెల్లడించారు. దీంతోపాటు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీతోపాటు మరిన్ని హామీలను ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 5 గ్యారెంటీలను అమలు చేస్తామని రాజస్థాన్ సీఎం స్పష్టం చేశారు.
రాజస్థాన్‌లో మళ్లీ అధికార పీఠాన్ని దక్కించుకుంటే పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించేందుకు చట్టం చేస్తామని అశోక్ గెహ్లోత్ తెలిపారు. కిలో ఆవు పేడను 2 రూపాయలకు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఇక కాలేజీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు గానీ, ట్యాబ్‌లు గానీ ఇస్తామని పేర్కొన్నారు. ఇక ప్రకృతి వైపరీత్యాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.15 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. చివరిగా ఒక కోటి మంది మహిళలకు మూడేళ్ల పాటు ఉచిత ఇంటర్నెట్‌తో స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేస్తామని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ స్పష్టం చేశారు.
ఎన్నికల హామీలను అమలు చేయడంలో రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ట్రాక్ రికార్డ్ ఉందని అశోక్ గెహ్లోత్ పేర్కొన్నారు. రాజస్థాన్‌లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే రైతుల రుణాలను మాఫీ చేస్తామని తమ పార్టీ అగ్ర నేత రాహల్ గాంధీ ఇచ్చిన హామీని నెరవేరుస్తామని ఈ సందర్భంగా అశోక్ గెహ్లోత్ తెలిపారు. ఇక రాజస్థాన్ ఎన్నికల వేళ ఆ రాష్ట్రంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు జరుపుతున్న సోదాలపై ఈ సందర్భంగా సీఎం స్పందించారు. తన కుమారుడికి ఈడీ సమన్లు జారీ చేయడం.. రాజస్థాన్ పీసీసీ చీఫ్ గోవింద్ సిన్హా ఇళ్లు, ఆఫీస్‌లపై దాడులు చేయడం.. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందనడానికి ఉదాహరణలు అని అశోక్ గెహ్లోత్ ఆరోపించారు.