ఇజ్రాయెల్‌పై నిమిషాల వ్యవధిలోనే గాజా స్ట్రిప్ నుంచి వేలాది రాకెట్లతో దాడులు చేసి.. హమాస్ ఉగ్రవాదులు ప్రస్తుత పరిస్థితికి ఆజ్యం పోసింది. ఆ తర్వాత హమాస్ మిలిటెంట్ గ్రూప్ కంటే అన్ని రకాలుగా బలమైన ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్‌పై భీకర పోరు సాగిస్తోంది. ఈ క్రమంలోనే గాజా స్ట్రిప్‌లో ఉన్న హమాస్ గ్రూప్‌ను అంతం చేసేవరకు తమ యుద్ధం ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేయడంతో పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ప్రపంచంలోని కొన్ని దేశాలు సమర్థిస్తుండగా.. అదే సమయంలో గాజా భూభాగంలో ఉన్న పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్ సైన్యం ప్రవర్తిస్తున్న తీరుపై మరికొన్ని దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య భీకర యుద్ధం సాగుతున్న వేళ.. ఇరాన్ సైన్యం 200 హెలికాప్టర్లతో యుద్ధ విన్యాసాలు ప్రారంభించడం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో హమాస్ ఉగ్రవాదులు చేస్తున్న దాడులను బహిరంగంగా సమర్థిస్తున్న ఇరాన్.. తాజాగా రెండు రోజుల పాటు సైనిక విన్యాసాలు చేపట్టడం సంచలనంగా మారింది. ఈ యుద్ధ విన్యాసాల గురించి ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఘర్షణతో మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ భయాలు నెలకొన్న వేళ.. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్.. ఎస్ఫహాన్‌లో సైనిక విన్యాసాలు చేపట్టడం యావత్ ప్రపంచాన్ని తీవ్ర కలవరపెడుతోంది.
ఇరాన్ ప్రభుత్వ మీడియాతో మాట్లాడిన ఇరాన్ ఆర్మీ కమాండర్.. తమ దేశానికి ఉన్న శత్రువులను హెచ్చరించడమే ఈ రెండు రోజుల సైనిక విన్యాసాల లక్ష్యమని వెల్లడించారు. ఇప్పటికే ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో హమాస్‌కు ఇరాన్ బహిరంగంగా మద్దతు ఇస్తోంది. ఇరాన్ సైన్యం చేపట్టిన యుద్ధ విన్యాసాల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ తెలిపారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌కు బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. గాజాపై ఇజ్రాయెల్ తన చేస్తున్న యుద్ధ నేరాలను ఆపకపోతే.. ఇతర కూటములతో కూడా ఇజ్రాయెల్ పోరాడాల్సిన దుస్థితికి చేరుకుంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ఎదుర్కోబోయే పరిస్థితులను ఆపడం కూడా అసాధ్యమని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఇరాన్ చేస్తున్న హెచ్చరికలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా ఉన్నాయని విశ్లేషకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఇరాన్, ఇజ్రాయెల్ బద్ధ శత్రు దేశాలుగా ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న శత్రుత్వంతో రెండు దేశాలు చాలా వేగంగా నష్టపోయాయని.. మిడిల్ ఈస్ట్‌లోని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఇరాన్ హమాస్‌తో చేతులు కలిపి.. ఇప్పుడు దానికి బహిరంగ మద్దతు కూడగడుతోందని పేర్కొన్నారు.