ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి పర్యాటకులను తమ దేశానికి వచ్చేలా ఆకర్షించడానికి థాయిలాండ్ వివిధ రకాల కార్యక్రమాలను చేపడుతోంది. ఇప్పటికే చైనా వాసులు థాయిలాండ్‌లో పర్యటించేందుకు ఎలాంటి వీసాలు అవసరం లేదని ప్రకటించిన థాయ్ ప్రభుత్వం.. తాజాగా అదే రకమైన సదుపాయాలను భారతీయులకు కూడా కల్పించింది. భారత్ నుంచి థాయిలాండ్ వచ్చేవారికి ఎలాంటి వీసాలు అవసరం లేదని తాజాగా స్పష్టం చేసింది. దీంతో మరింత మంది భారతీయులు థాయిలాండ్‌లో పర్యటిస్తే.. అది తమకు ఆర్థికంగా లాభం చేకూరుతుందని థాయ్ సర్కార్ ఈ సదుపాయాన్ని కల్పించింది.
టూరిజంను మరింత పెంచుకోవాలని చూస్తున్న థాయిలాండ్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నవంబర్ 10 వ తేదీ నుంచి థాయిలాండ్ వచ్చే భారతీయులకు ఎలాంటి వీసాలు అక్కర్లేదని స్పష్టం చేసింది. అయితే ఈ అవకాశం వచ్చే ఏడాది మే 10 వ తేదీ వరకు కొనసాగుతుందని తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. థాయిలాండ్‌కు ఉన్న ప్రధాన పర్యాటక వనరులలో భారత్ ఒకటి కావడం.. భారతీయులు ఏటా థాయిలాండ్‌కు పర్యాటకం కోసం భారీగా తరలివెళ్తున్న నేపథ్యంలో ఇలాంటి సౌకర్యం ఏర్పాటు చేసింది.
ఈ నవంబర్ 10 వ తేదీ నుంచి 2024 మే 10 వ తేదీ వరకు భారతీయులు వీసా లేకుండా థాయిలాండ్‌లో ప్రయాణించవచ్చని తాజాగా థాయ్ ప్రభుత్వం పేర్కొంది. ఒకసారి థాయిలాండ్‌కు వచ్చిన భారతీయులు 30 రోజుల వరకు తమ దేశంలో పర్యటించవచ్చని తెలిపింది. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు సహా పర్యాటకాన్ని ప్రోత్సహించాలని చూస్తున్న థాయిలాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా తర్వాత థాయ్‌లాండ్‌ను పర్యటించిన పౌరుల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. మలేసియా, చైనా, దక్షిణ కొరియా తర్వాత భారత్ ఉంది. ఈ ఏడాదిలో 12 లక్షల మంది భారతీయులు థాయ్‌లాండ్‌లో పర్యటించారు. విదేశాల్లో పర్యటించే వారి సంఖ్య 2011 లో 1.4 కోట్లు ఉండగా.. అది 2019 వరకు 2.7 కోట్లకు పెరిగిందని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
అయితే ఇప్పటికే ఈ సెప్టెంబర్‌లో చైనాకు ఇలాంటి అవకాశమే కల్పించింది. వీసా లేకుండానే చైనా వాసులు ప్రస్తుతం థాయిలాండ్‌లో పర్యటిస్తున్నారు. మరోవైపు.. శ్రీలంక కూడా తమ దేశంలో పర్యాటకాన్ని మరింత పెంచుకునేందుకు ఇటీవల ఏడు దేశాలకు చెందిన పౌరులు ఎలాంటి వీసాలు లేకుంండా తమ దేశంలో పర్యటించవచ్చని ప్రకటించింది. అందులో భారత్ కూడా ఉండటం గమనార్హం. పైలట్ ప్రాజెక్టు కింద 2024 మార్చి 31 వ తేదీ వరకు ఈ వీసా రహిత పర్యటనలకు అవకాశం ఉంటుందని శ్రీలంక స్పష్టం చేసింది. ఈ ఏడు దేశాల్లో భారత్, చైనా, రష్యా సహా వివిధ దేశాలు ఉన్నాయి.
మరోవైపు.. భారత్ నుంచి థాయిలాండ్‌కు రోడ్డు మార్గం కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది. భారత్ నుంచి మయన్మార్ మీదుగా థాయిలాండ్ వరకు జాతీయ రహదారిని నిర్మించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి 2002 ఏప్రిల్‌లో భారత్, మయన్మార్, థాయిలాండ్ దేశాలకు చెందిన మంత్రులు ఆమోదం తెలిపారు. భారత్ - మయన్మార్ - థాయిలాండ్ త్రైపాక్షిక జాతీయ రహదారి పొడవు 1400 కిలోమీటర్లు కాగా.. దాన్ని 2019 వరకు పూర్తి చేయాలని ప్రతిపాదించారు. అయితే కరోనా కారణంగా అది వాయిదా పడింది. ప్రస్తుతం ఈ జాతీయ రహదారి పనులు 70 శాతం పూర్తయ్యాయని మరో 3 నుంచి 4 ఏళ్లలో అందుబాటులోకి వస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కొన్ని నెలల క్రితం చెప్పారు.