కేరళలో జరిగిన ఓ ప్రార్థనా కార్యక్రమంలో వరుస పేలుళ్లు చోటు చేసుకోవడం యావత్ దేశాన్ని తీవ్ర ఉలిక్కిపాటుకు గురి చేశాయి. భారీ జన సమూహం ఉన్న ఆ ఈవెంట్‌లో వెంట వెంటనే మూడు బాంబులు పేలడంతో ఓ బాలిక సహా ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో 50 మందికి పైగా తీవ్ర గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనపై కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలను కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. ఈ కేరళ బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలపై కేరళలో కేసు నమోదైంది. వివిధ వర్గాల మధ్య విబేధాలు సృష్టించేలా కేంద్రమంత్రి ప్రకటనలు చేశారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు.
ఈ బాంబు పేలుళ్లపై కేరళ సీఎం పినరయి విజయన్‌ను ఉద్దేశించి కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేరళలో సంఘ విద్రోహ శక్తులు బలపడుతున్నాయని.. అయినా పినరయి విజయన్ సర్కార్ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని రాజీవ్ చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అయితే కేంద్రమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలను సీఎం పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యల్లో మతపరమైన ఎజెండా కనిపిస్తోందని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఒక బాధ్యతాయుతమైన కేంద్రమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి.. బాంబు పేలుళ్ల ఘటనను దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు సంస్థలపై కొంచెమైనా గౌరవం, నమ్మకం ఉంచాలని సూచించారు. కేసు దర్యాప్తు మొదట్లో ఉండగానే.. కేంద్రమంత్రి కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారని పినరయి విజయన్ తీవ్ర విమర్శలు చేశారు.
ఆదివారం కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న కలమస్సేరిలోని జమ్రా అంతర్జాతీయ సమావేశ కేంద్రంలోని ప్రార్థనా మందిరంలో బాంబు పేలుళ్లు జరిగాయి. టిఫిన్లలో ఉన్న ఐఈడీ బాంబులు పేలడంతో భారీగా శబ్ధం సంభవించింది. ఈ దుర్ఘటనలో 12 ఏళ్ల బాలికతో సహా ముగ్గురు చనిపోయారు. మరో 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. ప్రార్థనలు చేస్తున్న సమయంలో భారీ తీవ్రతతో మూడు బాంబులు పేలినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇక ఈ పేలుళ్లకు కారణం తానే అంటూ డొమినిక్ మార్టిన్ అనే 48 ఏళ్ల వ్యక్తి త్రిస్సూర్ పోలీసుల ముందు లొంగిపోవడంతో అతడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేసి అరెస్ట్ చేశారు. డొమినిక్ మార్టిన్ గల్ఫ్ దేశాల్లో ఉండగా.. ఈ పేలుళ్ల కోసమే 2 నెలల క్రితం కేరళకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్‌లో చూసి బాంబులను తయారు చేసినట్లు డొమినిక్ మార్టిన్ పోలీసులకు వెల్లడించాడు. అయితే ఈ బాంబులను తయారు చేసేందుకు కేవలం రూ. 3 వేలు మాత్రమే ఖర్చు చేసినట్లు చెప్పాడు.