ఇటీవలి కాలంలో మనుషుల మధ్య పెంపుడు శునకాలు గొడవలు పెట్టిస్తున్న ఘటనలు పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చాలా మంది కలిసి ఉండే అపార్ట్‌మెంట్ వాసుల మధ్య ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. పెంపుడు కుక్కలు పక్కవారిపై దాడులకు దిగడం, కరవడం వంటివి చేస్తున్న ఘటనలు పెరుగుతుండటంతో కొంతమంది పెంపుడు కుక్కలను అపార్ట్‌మెంట్‌లలోకి అనుమతించడానికి నిరాకరిస్తున్నారు. ఇక వాటిని పెంచుకునేవారు మాత్రం అవి తమతోనే ఉంటాయని వాదనకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పెంపుడు కుక్క కోసం గొడవ జరిగింది.
పెంపుడు కుక్కను లిఫ్ట్‌లోకి తీసుకురావడంతో వారి ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ముందు మాటా మాటా అనుకున్న వారిద్దరూ తర్వాత ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో అది కాస్త పెద్ద ఘర్షణగా మారింది. ఈ క్రమంలోనే లిఫ్ట్‌లోకి ఓ మహిళ తన పెంపుడు కుక్కతో పాటు ఎక్కింది. ఈ నేపథ్యంలోనే అక్కడే ఉన్న ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆ పెంపుడు శునకాన్ని లిఫ్ట్‌లో నుంచి బయటికి పంపించేయాలని సూచించాడు. అందుకు ఆ మహిళ నిరాకరించింది. దీంతో లిఫ్ట్ డోరుకు అడ్డంగా నిలబడిన ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి.. కుక్కను పంపించేవరకు లిఫ్ట్‌ను కదలనీయనని అడ్డుకున్నాడు.
దీంతో ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో వాగ్వాదానికి దిగిన ఆ మహిళ.. ఆ ఘటనను మొత్తం తన ఫోన్‌లో వీడియో తీయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కూడా తన ఫోన్‌లో రికార్డ్ చేయడం ప్రారంభించాడు. దాంతో ఆ మహిళ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఫోన్‌ను లాక్కుంది. తన ఫోన్ లాక్కోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మాజీ ఐఏఎస్ అధికారి ఆమె జుట్టు పట్టుకుని లాగారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ మహిళ.. ఆ ఐఏఎస్ అధికారి చెంపపై కొట్టింది. ఒక్కసారిగా ఇద్దరి మధ్య వివాదం తారస్థాయికి చేరడంతో ఒకరిపై ఒకరు విచక్షణ రహితంగా దాడి చేసుకున్నారు.
ఈ ఘటనతో ఆ మహిళ భర్త కూడా అక్కడికి వచ్చి ఆ రిటైర్డ్ ఐఏఎశ్ అధికారిని కొట్టాడు. దీంతో అక్కడే ఉన్న అపార్ట్‌మెంట్ వాసులు, సెక్యూరిటీ సహా మరికొందరు వచ్చి వారిని విడిపించారు. ఈ మొత్తం వ్యవహారం అంతా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అపార్ట్‌మెంట్ సీసీటీవీని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.