మరోసారి ప్రతిపక్ష నేతల ఫోన్‌లను ట్యాపింగ్ చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని పలువురు ఎంపీలు ఆరోపణలు చేశారు. ఈ మేరకు యాపిల్ సంస్థ నుంచి తమకు అలర్ట్ మెసేజ్‌లు వచ్చాయని వెల్లడించారు. ఈ ఆరోపణలు చేసిన వారిలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తదితరులు ఉన్నారు. సోషల్ మీడియాలో వీరంతా యాపిల్ నుంచి వచ్చిన అల్టర్ మెసేజ్ స్క్రీన్ షాట్‌లను షేర్ చేశారు. ‘ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే హ్యాకర్లు మీ ఐఫోన్‌ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.. మీ ఫోన్‌లోని సున్నితమైన సమాచారం సహా కమ్యూనికేషన్స్, కెమెరా, మైక్రోఫోన్‌లను వారు యాక్సెస్ చేసే అవకాశం ఉంది.. హ్యకర్లు వ్యక్తిగతంగా మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటారు.. దయచేసి అప్రమత్తంగా ఉండండి’ అనేది ఆ మెసేజ్ సారాంశం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కార్యాలయంలోని ముగ్గురి కూడా ఇటువంటి సందేశం వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వ వర్గాలు మాత్రం.. అధికారులు ఈ పరిస్థితిని ట్రాక్ చేస్తున్నారని, ఐఫోన్‌లలో ముప్పును గుర్తించడం తరచుగా అసంపూర్ణమైదని తెలిపాయి.
‘‘ఇండియా కూటమి ఎంపీల ఫోన్లను హ్యాక్ చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. నాతో పాటు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎంపీలు రాఘవ్ చద్దా, శశి థరూర్, ప్రియాంక చతుర్వేది, సీతారాం ఏచూరి, పవన్ ఖేరా, రాహుల్ గాంధీ కార్యాలయానికి యాపిల్ నుంచి వార్నింగ్ మెసేజ్‌లు వచ్చాయి. ఎమర్జెన్సీ కంటే ఇది దారుణం’ అని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ట్విట్టర్‌లో వెల్లడించారు. శశి థరూర్ కూడా హ్యాకింగ్ మెసేజ్‌లపై స్పందిస్తూ.. ‘‘నాకు యాపిల్ నుంచి అలర్ట్ మెసేజ్‌లు వచ్చాయి.. వాటిని వెరిఫై చేశాం. నాలాంటి వారు చెల్లించే పన్నులతో ఉద్యోగులను బిజీగా ఉంచడం ఎంతో ఆనందంగా ఉంది’ అని వ్యగ్యంగా ట్వీట్ చేశారు.
థరూర్ మాదిరిగా ఇతర ప్రతిపక్ష ఎంపీలు సైతం ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా కార్యాలయాలకు ట్యాగ్ చేశారు. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా.. నేరుగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ‘డియర్ మోదీ.. ఎందుకిలా చేస్తున్నారు’ అని ప్రశ్నించారు. ఆప్ ఎంపీ రాఘవ చద్దా.. ‘ప్రజాస్వామ్య ప్రయోజనాలు.. దేశ ప్రజలపై దాడి అని విమర్శించారు .ప్రతి భారతీయుడు ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే ఈ రోజు నేను, రేపు అది మీరు కావచ్చు అని అన్నారు.