కేరళ వరుస పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితుడు డొమినిక్ మార్టిన్ (48) ఇంటర్నెట్‌లో చూసి బాంబులను తయారు చేసినట్టు వెల్లడించాడు. ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లో నిపుణుడైన నిందితుడు.. బాంబులను తయారు చేయడానికి కేవలం రూ. 3,000 ఖర్చు చేసినట్టు అంగీకరించాడు. గల్ఫ్‌లో కొన్నేళ్లు ఫోర్‌మెన్‌గా పనిచేసిన మార్టిన్.. తన కుటుంబంతో ఐదేళ్లుగా కొచ్చి సమీపంలో అద్దెకు ఉంటున్నాడు. ఫోర్‌మెన్‌గా చేస్తున్న సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాలు, సర్క్యూట్‌ను కలపడం నేర్చుకున్నట్టు విచారణలో తెలిపాడు. పేలుళ్ల కోసం రెండు నెలల కిందటే గల్ఫ్ నుంచి కేరళకు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఐఈడీ తయారీకి టపాసుల్లో వినియోగించే తక్కువ తీవ్రత కలిగిన పేలుడు పదార్థాలను వినియోగించినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయ్యిందని పేర్కొన్నాయి. తన ఇంటిలోనే ఐఈడీలను తయారుచేసినట్టు చెప్పాయి. మూడు రోజుల పాటు జరిగిన జెహోవా మత సమ్మేళనానికి హాజరయ్యేవారిని చంపడమే లక్ష్యంగా కన్వెన్షన్ హాల్‌లోనే పేలుడు పదార్థాలను అమర్చినట్టు వివరించాయి. లొంగిపోయే ముందు మార్టిన్ సోషల్ మీడియాలో వీడియో సందేశాన్ని కూడా పోస్ట్ చేశాడు. సంస్థ బోధనలు విద్రోహపూరితమైనవి కాబట్టి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వీడియోలో తెలియజేశాడు. సమాజం, ప్రజలు, పిల్లలకు కూడా తప్పుడు విలువలను బోధిస్తుందని ఆరోపించాడు. పేలుళ్లను అడ్డుకోవాలని సవాల్ చేస్తే.. ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ఈ సంఘం దేశానికి చెడు చేస్తుందని అర్థం చేసుకున్న తాను.. వరుస పేలుళ్లకు పాల్పడాలని నిర్ణయించినట్టు పేర్కొన్నాడు.
ఎర్నాకుళం జిల్లా కలమసేరిలో ఆదివారం క్రైస్తవ ప్రార్థనా మందిరంలో మూడు వరుస పేలుళ్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 12 ఏళ్ల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో 50 మంది గాయపడ్డారు. పేలుళ్ల సమయానికి అక్కడ 2 వేల మంది వరకూ ఉన్నట్టు అధికారులు తెలిపారు. నిమిషాల వ్యవధిలోనే మూడు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. కేరళ పేలుళ్లు ఘటన నేపథ్యంలో దేశంలోని ప్రముఖ నగరాల్లో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబయిలోనూ హై అలర్ట్ విధించారు. ఢిల్లీ, ముంయి నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు, పోలీసులతో పహారా కాస్తున్నట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. గాజాపై ఇజ్రాయేల్ దాడుల నేపథ్యంలో కొచ్చి పేలుళ్ల వెనుక ఉగ్రకోణం ఉందా? అనే అనుమానంతో ఎన్ఐఏ కూడా దర్యాప్తు చేపట్టింది. పేలుళ్లకు ముందు రోజు పాలస్తీనాకు అనుకూలంగా ఓ వర్గం ర్యాలీ నిర్వహించగా.. హమాస్ నేత విర్చువల్‌గా పాల్గొనడం కలకలం రేగింది.