అస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో బెడ్‌ల ఖాళీలేక మాజీ ఎంపీ ఒకరు తన కుమారుడిని కోల్పోయారు. దీంతో తన కుమారుడి మృతదేహంతో ఆస్పత్రిలోని వార్డు ముందు కూర్చొని నిరసనకు బీజేపీ నేత దిగారు. విషాదకర ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో చోటుచేసుకుంది. తన కుమారుడు మృతికి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని, తక్షణమే అతడ్ని విధుల్లోంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ భైరాన్ ప్రసాద్ మిశ్రా కుమారుడు ప్రకాశ్ మిశ్రా (41) కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆదివారం రాత్రి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో లక్నో ఎస్‌జీపీజీఐ ఆసుపత్రికి తరలించారు.
రాత్రి 11 గంటలకు ఆస్పత్రికి తీసుకురాగా.. కొన్ని గంటలకే ప్రకాశ్ మిశ్రా మృతి చెందాడు. దీంతో తన కుమారుడి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆసుపత్రి వార్డులో నేలపై కూర్చొని నిరసన చేపట్టారు. ఎమర్జెన్సీ వార్డులో బెడ్‌లు ఖాళీగా లేవని, విధుల్లో ఉన్న వైద్యుడు ఎలాంటి సహాయం చేయలేదని ఆయన ఆరోపించారు. ‘నేను నా కొడుకును కోల్పోయాను. నా కుమారుడి చనిపోయిన తర్వాత దాదాపు 20-25 మంది రోగులకు చికిత్స చేశారు. నేను నిరసనకు దిగడంతో సదరు డాక్టర్‌ను తొలగించాలని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు.. నా కుమారుడు మృతికి కారణమైన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలి’ అని భైరాన్ ప్రసాద్ కోరారు.
ఈ ఘటనపై స్పందించిన అధికారులు.. విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేశారు. దీనిపై వివరణ ఇచ్చిన ఆసుపత్రి చీఫ్ ఆర్‌కే ధీమన్.. ఎంపీ కుమారుడిని ఐసీయూలో చేర్చమని విధుల్లో ఉన్న డాక్టర్ చెప్పారు. అయితే అక్కడ బెడ్‌లు ఖాళీగా లేవు.. అయినా ఆ డాక్టర్ అలా ఎందుకు చెప్పారో తెలియదు. మేము ఒక కమిటీని వేశాం.. దాని ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం డాక్టర్‌ను విధుల్లోంచి తొలగించాం’ అని ఆయన పేర్కొన్నారు.
కాగా, ప్రతిపక్ష సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ ఘటనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఇది ఆసుపత్రి తప్పిదం కాదని, సీఎం యోగి ఆదిత్యనాథ్ తప్పిదమని ఆరోపించారు. ఆసుపత్రులకు ఎందుకు నిధులు సమకూర్చడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరోవైపు, ఈ ఘటనపై యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందిస్తూ.. బాద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదొక దురదృష్టకర సంఘటన అని వ్యాఖ్యానించారు. ఇక, బైరాన్ ప్రసాద్ మిశ్రా 2014 సాధారణ ఎన్నికల్లో బండా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.