హమాస్ ఉగ్రవాదులు తమపై చేసిన దాడికి ఇజ్రాయెల్ గట్టిగా బదులు తీర్చుకుంటోంది. గాజా స్ట్రిప్‌ను చుట్టుముట్టి ఇప్పటికే హమాస్ మిలిటెంట్లతోపాటు పాలస్తీనీయులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్.. భూతల దాడులను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే హమాస్ గ్రూప్‌ను అంతం చేసేవరకు ఈ యుద్ధం ఆపేది లేదని మొదట్లోనే ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. తాజాగా అదే వైఖరిని కొనసాగిస్తున్నారు. హమాస్ గ్రూపుతో ఎట్టి పరిస్థితుల్లో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకునేది లేదని ప్రకటించిన బెంజమిన్ నెతన్యాహు తమ సైనికుల దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. దీంతో గాజాపై మరింత భీకరంగా ఇజ్రాయెల్ దాడులు జరుగుతాయనే ఆందోళనలు ప్రపంచ దేశాల్లో వెల్లువెత్తుతున్నాయి.
హమాస్ మిలిటెంట్లతో కాల్పుల విరమణకు అంగీకరించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఒకవేళ తాము హమాస్ ఉగ్రవాదులతో చర్చలు జరపడం, కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడం అంటే హమాస్ మిలిటెంట్ల ముందు ఇజ్రాయెల్ సైనికులను లొంగిపోవాలని చెప్పినట్లే అవుతుందని పేర్కొన్నారు. ఏది ఏమైనా హమాస్ ఉగ్రవాదులను తుదముట్టించే ప్రయత్నంతోనే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. అయితే యుద్ధం చేసేటపుడు ఏ దేశమైనా సామాన్య పౌరుల ప్రాణాలు తీయదని.. గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం మాత్రం నాగరితకకు.. అనాగరికతకు మధ్య జరుగుతున్న పోరు అని అన్నారు.
ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితిపైనా తన అసంతృప్తిని బెంజమిన్ నెతన్యాహు వెల్లగక్కారు. హమాస్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం కూడా అంత అనుకూలంగా లేదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో జరిగిన దారుణాలను నాగరికంగా ఆలోచించే ఏ దేశం కూడా సహించదని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే కాల్పుల విరమణకు తాము అంగీకరించేది లేదని మరోసారి స్పష్ట చేశారు. తాము కాల్పుల విరమణకు పిలుపునిస్తే.. హమాస్ గ్రూపు ముందు, ఉగ్రవాదం ముందు, అనాగరికత ముందు లొంగిపోయినట్లు అవుతుందని తెలిపారు. పెరల్ హార్బర్, 9/11 ఉగ్రదాడుల తర్వాత ఎలాగైతే అమెరికా కాల్పుల విరమణకు అంగీకరించలేదో.. ప్రస్తుతం ఇజ్రాయెల్ కూడా అంగీకరించదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం ఇజ్రాయెల్ భవిష్యత్తుకు సంబంధించిందని పేర్కొన్నారు. ఇక గాజాను చుట్టుముట్టి అందులోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్.. భూతల దాడులు చేస్తోంది. అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ ట్యాంకులు గాజా వీధుల్లో తిరుగుతునన్న దృశ్యాలను ఇజ్రాయెల్ సైన్యం సోషల్ మీడియాల్లో విడుదల చేసింది. హమాస్ ఉగ్రవాద గ్రూపుకు చెందిన టాప్ కమాండర్లను హతమార్చుతోంది.