హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి విడుదలైన తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో రోడ్డు మార్గంలో బయలుదేరి సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్నారు. 14 గంటల నిర్విరామ ప్రయాణం అనంతరం బుధవారం ఉదయం 6గంటలకు ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు. నిర్విరామంగా సుదీర్ఘ ప్రయాణంతో ఆయన అలసిపోయారు. దారి పొడవునా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో కనీవినీ ఎరుగని రీతిలో చంద్రబాబు నాయుడుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయన నివాసం వద్ద పెద్ద ఎత్తున నాయకులు, మహిళలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. మహిళలు పెద్దఎత్తున ఇంటివద్దకు చేరుకుని గుమ్మడికాయలతో దిష్టితీస్తూ అధినేతకు నీరాజనాలు పలికారు.