తిరుమల తిరుపతి దేవస్థానానికి రెండు అంశాలకు సంబంధించి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్ర హెచ్చరిక చేశారు. బుధవారం అలిపిరిని సందర్శించిన అనంతరం పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలోని పార్వేటి మండపం తొలగించి, యదావిధిగా నిర్మిస్తామని ఇష్టానుసారంగా చేశారని.. ఇప్పుడు తిరుపతిలోని అలిపిరి వద్ద మండపాన్ని తొలగిస్తామని అంటున్నారని మండిపడ్డారు. 75 సంవత్సరాలు పూర్తి అయిన మండపాలను తొలగించాలంటే పురవస్తుశాఖ అనుమతి, పర్యవేక్షణ తప్పనిసరి అని చెప్పారు. కానీ తిరుమలలో అలా జరగలేదన్నారు. అలిపిరి వద్ద ఉన్న మండపం 500 సంవత్సరాలకంటే ఎక్కువే అయ్యిందని తెలిపారు. అలిపిరిలోని మండపాన్ని ఏమి చేయాలన్నా... టీటీడీ తప్పకుండా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పర్యవేక్షణలోనే చేయాలని... లేదంటే బీజీపే తప్పకుండా ప్రతిఘటిస్తుందని ఏపీ బీజేపీ చీఫ్ హెచ్చరించారు. ఇటీవల టీటీడీ నిధులను తిరుపతి మున్సిపాలిటీకి కేటాయించే విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గిందన్నారు. అయితే మరో మార్గంలో టీటీడీ నిధులను పొందేందుకు ప్రయత్నాలు జరుగుతోందని.. అదే జరిగితే బీజేపీ ప్రతిఘటిస్తుందని మరో హెచ్చరిక చేశారు. చెత్త పన్ను, కరెంటు చార్జీల మోత ఇలా ఎన్నో రకాలుగా వసూలు చేస్తున్న పన్నులతోనే మౌళిక సౌకర్యాలు కల్పించాలన్నారు. టీటీడీ నిధులతో సనాతన ధర్మా అభ్యున్నతికే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం ఇమామ్‌లకు, ఫాస్టర్లకు గౌరవవేతనం ఇస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ అర్చకులు ఉన్న ఆలయాల దూపదీప నైవేద్యాలకు ఇస్తున్న సంభావనను నిలిపివేసిందని.. దళిత అర్చకులకు నిలిపివేసిన సంభవనను వెంటనే కొనసాగించాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు.