ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జైలు నుంచి రాగానే చంద్రబాబుకు పసుపు సంచి అందించిన బ్రాహ్మణి, బాలయ్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 01, 2023, 07:36 PM

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. మంగళవారం సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో జైలు నుంచి బయటకు అడుగు పెట్టారు. అధినేతను చూసి పార్టీ నేతలు, కార్యకర్తలు భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు గేటు నుంచి బయటకు రాగానే మనవడు దేవాన్ష్‌ను దగ్గరకు తీసుకుని హత్తకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, పార్టీ నేతల్ని ఆప్యాయంగా పలకరించారు. జైలు దగ్గర కొద్దిసేపు ఎమోషనల్ సీన్ కనిపించింది.


ఈ క్రమంలో జైలు దగ్గర ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే నారా బ్రాహ్మణి, నందమూరి బాలయ్యలు చంద్రబాబుకు ఓ పసుపు సంచిని అందజేశారు. దీంతో ఆ సంచిలో ఏముందనే చర్చ జరిగింది.. ఆ తర్వాత ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. చంద్రబాబు బావమరిది, హిందపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య చంద్రబాబు క్షేమం కోరుతూ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమిళనాడులోని ఆలయాల్లో కూడా ప్రత్యేకంగా పూజలు చేయించారు.


ఈ క్రమంలో తమిళనాడులోని ప్రసిద్ధ దేవాలయాల్లో సోమవారం చంద్రబాబు కోసం ప్రత్యేక పూజలు చేయించిన నందమూరి బాలయ్య.. ఆ ఆశీర్వాద ఫలాన్ని అధినేతకు అందజేశారు. అనంతరం బాలయ్య చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. రాజమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గాన బయల్దేరిన చంద్రబాబు 14.30 గంటల సుధీర్ఘ ప్రయాణం తర్వాత బుధవారం ఉదయం 5.45 గంటల సమయంలో ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు. అక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలు, అమరావతి రైతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నారా భువనేశ్వరి స్వయంగా చంద్రబాబుకు దిష్టి తీశారు.


రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరిన చంద్రబాబుకు దారి పొడవునా తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు. రాజమహేంద్రవరం నుంచి వేమగిరి, రావులపాలెం, పెరవలి, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, హనుమాన్‌ జంక్షన్‌, గన్నవరం, విజయవాడ మీదుగా చంద్రబాబు ఉండవల్లికి చేరుకున్నారు. హైకోర్టు ఉత్తర్వులు ఉండటంతో చంద్రబాబు కారులోనే కూర్చుని.. దారి పొడవునా ఉన్న ప్రజలకు నమస్కరిస్తూ ముందుకు సాగారు. ప్రతి ఊరిలోనూ పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు.. బాణసంచా కాలుస్తూ, పూలు చల్లుతూ, గజమాలలతో చంద్రబాబుకు స్వాగతం పలికారు.


అంతేకాదు చంద్రబాబు షెడ్యూల్ మొత్తం మారిపోయింది. బుధవారం విజయవాడ నుంచి రేణిగుంటకు వెళ్లి అక్కడి నుంచి తిరుమలకు వెళ్లి.. గురువారం శ్రీవారిని దర్శించుకోవాలని భావించారు. కానీ చంద్రబాబు ఆరోగ్య కారణాల రీత్యా షెడ్యూల్ మార్చారు.. బుధవారం విజయవాడ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లనున్నారు. అక్కడ ఆస్పత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకోనున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎవరినీ చంద్రబాబు కలవరని స్పష్టత ఇచ్చారు.. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa