టీడీపీ అధినేత చంద్రబాబు షెడ్యూల్ మారింది. వాస్తవానికి ఇవాళ తిరుపతికి వెళతారని.. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని హైదరాబాద్‌కు వెళ్లాలని భావించారు. కానీ చంద్రబాబు ఇవాళ హైదరాబాద్ వెళ్లనున్నారు. కోర్టు ఆదేశాలతో ఆయన అక్కడే వైద్య పరీక్షలు చేయించుకుంటారని.. ఎవరినీ కలవరని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు నాయుడు జగన్ పెట్టిన అక్రమ కేసుల వల్ల 52 రోజుల పాటు జైల్లో ఉన్నా టీడీపీ నాయకులు, కార్యకర్తలు మనో ధైర్యం కోల్పోకుండా అక్రమ అరెస్ట్ ని నిరసిస్తూ వివిధ నిరసన కార్యక్రమాలు నిర్వహించారన్నారు. చంద్రబాబుకు బెయిల్ రావటం రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలతో పాటు వివిద దేశాల్లోని తెలుగు పౌరులకు సంతోషకరమని.. ఇదే స్పూర్తి ముందు కూడా కొనసాగిద్దామన్నారు. కోర్టు ఆదేశాలతో చంద్రబాబు ఆరోగ్యపరీక్షలు నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్నారన్నారు. పార్టీ నేతలకు ఎవరిని కలవరని.. కార్యకర్తలు, నాయకులు ఈ విషయం గమనించాలని విజ్ఞప్తి చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు.. దాదాపు 14.30గంటల నిర్విరామ ప్రయాణం అనంతరం బుధవారం ఉదయం 5.45గంటల ప్రాంతంలో ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు. నిర్విరామంగా సుదీర్ఘ ప్రయాణంతో చంద్రబాబు అలిసిపోయారు. చంద్రబాబు ఉండవల్లి నివాసానికి రాగానే టీడీపీ నేతలు, కార్యకర్తలు, అమరావతి రైతులు, మహిళలు చంద్రబాబునాయుడు ఉండవల్లి నివాసం దగ్గర భారీగా చేరుకున్నారు.. చంద్రబాబు నివాసం వద్ద పెద్దఎత్తున నాయకులు, మహిళలు, అభిమానుల ఘనస్వాగతం. మరోవైపు చంద్రబాబు కాన్వాయ్ ఉదయం 5.30 గంటల ప్రాంతంలో విజయవాడ వన్ టౌన్ వినాయకుడి గుడి సెంటర్ కు చేరుకుంది. అక్కడకు చేరుకోగానే జనసేన కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్‌కి స్వాగతం పలికారు. విజయవాడ పశ్చిమ జనసేన ఇంచార్జ్ పోతిన మహేష్ నేతృత్వంలో పెద్దఎత్తున జనసేన కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్ కి ఎదురేగి స్వాగతించారు. చంద్రబాబుకు సంఘీభావంగా జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు.
చంద్రబాబు మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వెంటనే మనవడు దేవాన్ష్‌ను ముద్దాడారు. చంద్రబాబు జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా మిగతా కుటుంబసభ్యులు ములాఖత్‌లో ఆయనను కలిసినా, మనవడు దేవాన్ష్‌ను చూసే అవకాశం రాలేదు. అమ్మానాన్నలతోపాటు దేవాన్ష్ కూడా మంగళవారం జైలు వద్దకు వచ్చాడు. తాత రాక కోసం కారులోనే నిరీక్షించాడు. చంద్రబాబు జైలు ప్రధాన ద్వారం నుంచి బయటకు రాగానే తాతా అంటూ వెళ్లి హత్తుకున్న దృశ్యం కనిపించింది . మనవణ్ని ఆత్మీయంగా హత్తుకుని ముద్దాడిన చంద్రబాబు ముఖంలో ఒక్కసారిగా ఆనందం కనిపించింది. చంద్రబాబు జైలు నుంచి బయటకు రాగానే.. ఆయన బావమరిది, సినీ నటుడు బాలకృష్ణ స్వాగతం పలికి, పాదాభివందనం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa