ఆంధ్రప్రదేశ్‌లో 3 లక్షల 85 వేల పశువులు మాయం అయ్యాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పశువుల అదృశ్యం వెనుక వైసీపీ నేతల హస్తం ఉందన్నారు. ఏపీలో 3,85 వేల పాడి పశువులు కనిపించడం లేదని అధికారులు తేల్చారని పేర్కొన్నారు. పశువుల అదృశ్యం వెనుక పెద్ద స్కాం ఉందన్నారు. వైఎస్సార్ చేయూత ద్వారా పాడి పశువులు కొనడానికి కేబినెట్ తీర్మానించిందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 2,08,790 పశువులు కొనుగోలు చేసినట్లు పశు సంవర్థక శాఖ మంత్రి చెప్పారన్నారు. 3,94,000 పశువులు కొనుగోలు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీలోనే మరుసటి రోజు చెప్పారన్నారు. ఒక్క రోజులోనే లక్షకు పైగా పశువుల లెక్కలు మార్చారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పాల వెల్లువను వైసీపీ పాపాల వెల్లువగా మార్చారన్నారు. అధికారులు లెక్కలు తెలిస్తే కేవలం 8 వేల పశువులు మాత్రమే క్షేత్ర స్థాయిలో ఉన్నాయన్నారు. అంటే ఒక గేదేను చాలా పేర్లతో కొనుగోలు చేసినట్లు చూపించారన్నారు. గేదెల కొనుగోలులో 2887 కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగిందని మనోహర్ తెలిపారు. సంక్షేమం పేరుతో ఏపీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందన్నారు. బీహార్‌లో పశుదాణా కుంభకోణం జరిగినట్లు ఏపీలో కూడా గేదెల కొనుగోళ్ల స్కాం జరిగిందన్నారు. ఈ స్కాంపై సీఎం జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ సమయంలో 50,000 గేదెలు కొనుగోలు చేయడానికే చాలా ఇబ్బంది పడ్డారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.