తిరుమల శ్రీవారి భక్తుల గదుల కాషన్ డిపాజిట్‌పై టీటీడీ మరోసారి క్లారిటీ ఇచ్చింది. శ్రీవారి దర్శనార్థం విచ్చేసి.. యుపీఐ విధానంలో చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు.. గదులు ఖాళీ చేసిన ఒక గంటలోపు కాషన్ డిపాజిట్ మొత్తం రీఫండ్ చేస్తున్నామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. తిరుమలలో గదుల్ని క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు 3 నుంచి 7 పనిదినాలలోపు వారి అకౌంట్‌లకు కాషన్ డిపాజిట్ మొత్తం జమ చేస్ుతన్నామని తెలిపారు. ఈ సమాచారం ధ్రువీకరించుకోకుండా కొందరు భక్తులు కాల్ సెంటర్లకు ఫోన్లు చేసి.. అధికారులకు మెయిళ్లు పంపుతున్నారన్నారు. భక్తులు తమ బ్యాంక్ స్టేట్‌మెంట్లను పరిశీలించుకుని కాషన్ డిపాజిట్ మొత్తం రీఫండ్ కాకపోతేనే సంప్రదించాలని కోరారు.
రీఫండ్ కోసం కొందరు భక్తులు సొమ్ము చెల్లించిన బ్యాంకును కాకుండా మరో బ్యాంకు స్టేట్‌మెంట్‌ను తప్పుగా సరిచూసుకుంటున్నారన్నారు. ఎస్ఎంఎస్‌లో సూచించిన విధంగా 3 నుంచి 7 రోజులు వేచి ఉండడం లేదని వివరించారు. మరికొందరు టీటీడీ నిబంధనల ప్రకారం గది ఖాళీ చేయడం లేదని.. వెరిఫికేషన్ కోడ్ సబ్‌మిట్ చేయకపోవడం.. ఫొటో సరిపోలకపోవడంతో రీఫండ్ జనరేట్ కావడం లేదని వివరించారు.
తిరుమలలో వసతి గదులు బుక్ చేసుకునే సమయంలో టీటీడీ ప్రతి భక్తుడి దగ్గర కాషన్ డిపాజిట్ తీసుకుంటుంది. యుపీఐ విధానంలో చెల్లింపులు చేస్తే కాషన్ డిపాజిట్‌ను గంటలోనే రీఫండ్ చేస్తారని టీటీడీ చెబుతోంది. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లిస్తే మాత్రం 3 నుంచి 7 పని దినాల సమయం పడుతుందని టీటీడీ పదే, పదే భక్తులకు సమాచారం ఇచ్చింది. అయినా సరే కొందరు భక్తులు కాషన్ డిపాజిట్ విషయంలో పదే, పదే టీటీడీని సంప్రదిస్తుండటంతో ఈవో స్పష్టతనిచ్చారు.
కార్తీక మాస ఉత్సవాలు
పవిత్రమైన కార్తీక మాసంలో పలు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని టీటీడీ ఈవో తెలిపారు. నవంబరు 14 నుండచి డిసెంబరు 12వ తేదీ వరకు తిరుమల నాదనీరాజనం వేదికపై నారదపురాణం పారాయణం జరుగనుంది. నవంబరు 14 నుండి డిసెంబరు 12వ తేదీ వరకు తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ధ్యానారామంలో రుద్రాభిషేకం నిర్వహిస్తామని తెలిపారు. నవంబరు 17న తిరుపతి ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలోని యాగశాలలో నాగులచవితి పూజ నిర్వహిస్తామన్నారు.
తిరుమల వసంత మండపంలో..
- నవంబరు 23న ప్రబోధన ఏకాదశి రోజున శ్రీ విష్ణుసాలగ్రామ పూజ.
- నవంబరు 24న కైశికద్వాదశి రోజున శ్రీ తులసి దామోదర పూజ.
- నవంబరు 29న గోపూజ.
- డిసెంబరు 10న ధన్వంతరి జయంతి.
కార్తీక దీపోత్సవాలు
- నవంబరు 20న తిరుపతి, 27న కర్నూలు, డిసెంబరు 11న వైజాగ్‌లో కార్తీక దీపోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నాం.
హోమ మహోత్సవాలు
- నవంబరు 14 నుండి డిసెంబరు 12వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీకపిలేశ్వరాలయంలో హోమ మహోత్సవాలు నిర్వహిస్తాం.
నవంబరు 12న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
- శ్రీవారి ఆలయంలో ఉదయం 7 నుండి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది.
- ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు.
- సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు.
- ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది.
నవంబరు 24న కైశిక ద్వాదశి ఆస్థానం
- కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. మొదటిసారిగా స్వామివారి ఊరేగింపును ఎస్వీబిసిలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.
- వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు.
- అనంతరం ఉదయం 5.30 నుండి ఉదయం 7 గంటల వరకు స్వామి, అమ్మవార్లను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
నవంబరు 24న చక్రతీర్థ ముక్కోటి
- తిరుమలలో జరిగే అత్యంత ప్రముఖమైన ఉత్సవాలలో చక్రతీర్థ ముక్కోటి ఒకటి.
- చక్రతీర్థ ముక్కోటినాడు ఉదయం అర్చకులు, పరిచారకులు మంగళవాయిద్యాలతో ఆలయం నుండి ప్రదక్షిణంగా చక్రతీర్థానికి వెళతారు.
- చక్రతీర్థంలో వెలసివున్న శ్రీ చక్రత్తాళ్వారువారికి, శ్రీ నరసింహస్వామివారికి, శ్రీ ఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం, పూజలు చేస్తారు. అనంతరం హారతి నివేదించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు.