తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రెండు బ్రహ్మోత్సవాలు జరగడంతో పాటూ తమిళుల పెరటాసి మాసం కారణంగా భక్తుల రద్దీ కనిపించింది. దీంతో తిరుమల శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరుతోంది. అక్టోబర్ నెల కూడా శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్ల రికార్డ్ కొనసాగింది. గత నెల (అక్టోబర్)లో శ్రీవారిని 21.75 లక్షలమంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 8.30 లక్షల మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారికి హుండీ ద్వారా రూ.108.65 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. అంతేకాదు అక్టోబర్ నెలలో 1.05 కోట్ల లడ్డూలను భక్తులకు టీటీడీ విక్రయించింది.. 47.14 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గతేడాది మార్చి నుంచి తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్‌ను అందుకుంటోంది. కరోనా కారణంగా గతేడాది మార్చి వరకు భక్తుల రద్దీ పెద్దగా కనిపించలేదు.. ఆ తర్వాత నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భక్తుల రద్దీ పెరుగుతూ వచ్చింది.. వీకెండ్‌తో పాటూ పండగల సమయంలోనూ కొండపై రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ క్రమంలో స్వామివారి హుండీకి వచ్చే ఆదాయం కూడా పెరుగుతోంది. రూ.100 కోట్ల మార్క్‌ను ఈజీగా అందుకుంటోంది.