ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో విపరీతమైన జాప్యం ఎందుకు జరగుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు చెప్పాలని సీబీఐని ఆదేశించింది. సీబీఐ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ జనవరికి వాయిదా వేసింది.
విచారణ సందర్భంగా పిటిషన్‌పై పలు ప్రశ్నలు సంధించింది. జగన్ అక్రమాస్తుల కేసుకు ఎంపీ రఘురామకు సంబంధం ఏంటని ప్రశ్నించింది. ఎంపీ రఘురామ ఫిర్యాదుదారు కాదని.. బాధితుడు కూడా కానప్పుడు ఆయనెందుకు పిటీషన్ వేశారని అడిగింది. ఫిర్యాదుదారు కానప్పటికీ పిటీషన్ దాఖలు చేయొచ్చని ఎంపీ రఘురామ తరపు లాయర్ కోర్టుకు వివరించారు. అయితే మూడో వ్యక్తి ఎందుకు పిటిషన్ వేశారని ధర్మాసనం ప్రశ్నించింది.. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి కదా అని కోర్టు ప్రశ్నించగా.. ఎంపీ రఘురామ కూడా వైఎస్సార్‌సీపీ ఎంపీనే అని లాయర్ తెలిపారు.
సీఎం జగన్ ఆస్తుల కేసుల విచారణను వేరే రాష్ట్రానికి మార్చాలని ఎంపీ రఘురామ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తెలంగాణ సీబీఐ కోర్టులో జగన్ కేసులపై విపరీతమైన జాప్యం జరుగుతోందని.. 3071 సార్లు జగన్ కేసును సీబీఐ కోర్టు వాయిదా వేసినట్లు పిటిషన్‌లో ప్రధానంగా ప్రస్తావించారు. జగన్ ప్రత్యక్షంగా హాజరుకాకుండా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చిందని.. వందల కొద్ది డిశ్చార్జి పిటిషన్లు వేసినట్లు పేర్కొన్నారు.
వైఎస్ జగన్‌పై సీబీఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటివరకు 3,041 సార్లు వాయిదా పడ్డాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. వీటి విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సీబీఐలో కనిపించట్లేదని.. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్‌కు ఇష్టానుసారం వాయిదాలు కోరే స్వేచ్ఛనిచ్చారని ప్రస్తావించారు. అందువల్ల ఈ కేసుల విచారణకు అంతు లేకుండా పోతోందని.. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే కేసుల విచారణ ప్రారంభమయ్యే పరిస్థితే కనిపించట్లేదు అంటూ పిటిషన్‌లో కోర్టుకు వివరించారు. అందువల్ల వెంటనే దేశ సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని.. ఈకేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ పిటిషన్‌లో కోరారు. సుప్రీం కోర్టు నోటీసులకు సీబీఐ సహా ప్రతివాదులు ఎలాంటి సమాధానం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కేసుల విచారణ ఆలస్యం కావడానికి కారణాలపై ఎలాంటి వివరణ ఇస్తారన్నది కూడా చూడాలి.