కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు నెలలు పూర్తయింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, శివకుమార్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరికి కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగి ఇద్దరు నేతలను సముదాయించి చివరికి సీనియర్ నేత సిద్ధరామయ్యకే సీఎం పీఠాన్ని అప్పగించింది. అయినా కన్నడ నాట సీఎం కుర్చీ కోసం పోరు ఆగడం లేదు. ఇదే అదనుగా ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉంది. మరోవైపు.. డీకే శివకుమార్ వర్గంలోని కొందరు నేతలు కూడా సీఎం కుర్చీ డీకే శివకుమార్‌కే వరిస్తుందని చెబుతుండగా.. ఐదేళ్లు తానే ఉంటానని సిద్దరామయ్య ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే కూడా రంగంలోకి దిగారు.
ఈ క్రమంలోనే కర్ణాటక సీఎం ప్రియాంక్ ఖర్గే సైతం సీఎం పీఠంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే సీఎం పదవి చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తాజాగా శుక్రవారం మీడియా అడిగిన ప్రశ్నకు ప్రియాంక్ ఖర్గే ఈ సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని హైకమాండ్ తనను అడిగితే.. తాను సరే అని అంటానని చెప్పారు. సీఎం సీటుపై ప్రియాంక్ ఖర్గే తాజాగా చేసిన వ్యాఖ్యలు కన్నడ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష బీజేపీపై ప్రియాంక్ ఖర్గే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటకలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులకు కేంద్ర బీజేపీ నేతలు మద్దతు పలుకుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కర్ణాటక బీజేపీ నేతలకు రూ.1000 కోట్లు పంపారని ప్రియాంక్ ఖర్గే పేర్కొన్నారు. అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారితే.. రూ. 50 కోట్లు నగదు, మంత్రి పదవి ఇస్తామని కొందరు బీజేపీ నాయకులు ఆశ చూపారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గనిగ ఆరోపించడం కర్ణాటక రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
అయితే అంతకుముందే కర్ణాటక సీఎం పదవి గురించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో సీఎంను మార్చనున్నారు అని వార్తల నేపథ్యంలో ఈ అంశంపై స్పందించిన సిద్ధరామయ్య.. రాష్ట్రంలో అధికార మార్పు ప్రసక్తే లేదని.. ఐదేళ్లపాటు తానే ముఖ్యమంత్రి పదవిలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. గతంలో ఒకసారి ఆపరేషన్ కమలం విజయం సాధించడంతో మరోసారి అలాగే చేయొచ్చని ప్రయత్నిస్తున్నారు. కానీ ఈసారి మాత్రం అలా చేయలేరని.. బీజేపీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు.