శీతకాలం మొదలుకావడంతో ఢిల్లీవాసుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. దేశ రాజధానిని వాయు కాలుష్యం కమ్మేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందును ఎదుర్కొంటున్నారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న వాయు నాణ్యత.. పొరుగున ఉన్న హరియాణా, పంజాబ్‌లలో రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టడంతో ప్రమాదకరస్థాయికి చేరింది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. రెండు రోజులపాటు ప్రాథమిక పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. కాలుష్యం కారణంగానే శుక్ర, శనివారాలు సెలవులు ఇచ్చినట్లు కేజ్రీవాల్ సర్కారు తెలపింది.
ఈ ఉత్తర్వులు ప్రభుత్వ, ప్రైయివేటు విద్యా సంస్థలకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. దీంతో పాటు రాజధాని ప్రాంతంలో చేపడుతున్న పలు నిర్మాణ పనులపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో అనవసరమైన నిర్మాణ కార్యకలాపాలను కేంద్ర కాలుష్య నియంత్రణ కమిటీ నిషేధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) కూడా ఢిల్లీలోకి డీజిల్ వాహనాల ప్రవేశాన్ని నిషేధించినట్టు ప్రకటించింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ (జీఆర్ఏపీ) 3లో భాగంగా శీతాకాలంలో వాయుకాలుష్యాన్ని అరికట్టడానికి చర్యలు చేపడుతున్నారు.
గురువారం సాయంత్రం 5 గంటలకు వాయు నాణ్యత సూచీ 402 పాయింట్ల వద్ద ఉంది. కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. జీఆర్ఏపీ 3వ దశలో ప్రభుత్వ ప్రాజెక్టులు, మైనింగ్, స్టోన్ క్రషింగ్ మినహా అన్ని నిర్మాణ, కూల్చివేత పనులపై నిషేధం ఉంటుంది. డీజిల్ వాహనాలకు సైతం ఇదే నిబంధన వర్తిస్తుందని తెలిపింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచీ 400 మార్క్ దాటింది. ఆనంద్ విహార్ (450), బవానా (452), బురారీ క్రాసింగ్ (408), ద్వారకా సెక్టార్ 8 (445), జహంగీర్‌పురి (433), ముండ్కా (460), ఎన్ఎస్ఐటీ ద్వారక (406) , నజఫ్‌గఢ్ (414), నరేలా (433), నెహ్రూ నగర్ (400), న్యూ మోతీ బాగ్ (423), ఓఖా ఫేజ్ 2 (415), పత్పర్‌గంజ్ (412), పంజాబీ బాగ్ (445), ఆర్‌కే పురం (417), రోహిణి ( 454), షాదీపూర్ (407), వజీర్‌పూర్ (435).
మరోవైపు, వచ్చే మూడు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. అటు, వాయు నాణ్యత పెంపునకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కాలుష్యం కారణంగా ప్రజలు ఆస్తమా తదితర వ్యాధులతో సతమతమవుతున్నారని.. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని సూచించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) డేటా ప్రకారం వాయు నాణ్యత సూచీ 0-50 మధ్య ఉంటే ‘అరోగ్యానికి మంచిది’, 51-100 సంతృప్తికరం, 101-200 మధ్యస్థం, 201-300 పేలవం,, 301-400 చాలా పేలవం, 401-500 తీవ్రమైనదిగా పరిగణిస్తారు. 500 కంటే ఎక్కువ ఉంటే అతి తీవ్రమైనదిగా పరిగణిస్తారు.