విజయవాడ బస్టాండ్‌లో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తంచేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉదయం ముఖ్యమంత్రికి ప్రమాద ఘటనపై వివరాలను అధికారులు అందించారు. ఆర్టీబస్సు ప్రమాదవశాత్తూ ఫ్లాట్‌ఫాంమీదకు దూసుకుపోవడంతో ఈ ఘటన జరిగిందని వివరించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని.. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.
మరోవైపు విజయవాడ బస్టాండ్‌లోని ఘటనాస్థలాన్ని ఆర్డీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పరిశీలించారు. బస్సు ప్రమాదం దురదృష్టకరమని.. బస్సులో అప్పటికే 24 మంది ప్రయాణికులు ఉన్నారని.. బయల్దేరే ముందు ఈ ఘటన జరిగిందని చెప్పారు. దీనిపై 24 గంటల్లో పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ వయసు 62 ఏళ్లని.. ఆయన అనారోగ్యం నుంచి కోలుకుని వచ్చారని తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సు కండిషన్‌లోనే ఉందని.. కాలం చెల్లిన బస్సులను తొలగిస్తున్నామని చెప్పారు. 15 ఏళ్లు దాటిన 232 బస్సులను తొలగించామని.. కొత్త బస్సుల కొనుగోలుకు ప్రతిపాదనలు పెట్టామని ఆర్టీసీ ఎండీ వివరించారు. మృతుల కుటుంబాలకు ఆర్టీసీ తరఫున రూ.5లక్షల పరిహారం అందజేస్తామని చెప్పారు.