ఏపీలో వీఆర్వోలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్. వీఆర్వోల కోసం ప్రభుత్వం 154, 64, 6538, 166, 31 జీవోలు జారీ చేసిందని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు తెలిపారు. వీఆర్వోల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపేందుకు త్వరలో రాష్ట్రస్థాయిలో విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఏపీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశంలో రవీంద్రరాజు తెలిపారు. రెవెన్యూ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ పదోన్నతులలో వీఆర్వోలకు ప్రస్తుతం ఉన్న కోటా 40 శాతం నుంచి 70 శాతానికి పెంచాలన్నారు. అలాగే ఖాళీగా ఉన్న సీనియర్ సహాయకుల పోస్టులలో వన్‌టైమ్ సెటిల్మెంట్ ప్రకారం 70 శాతం పదోన్నతులను వీఆర్వోలతో భర్తీ చేయాలని కోరారు. సర్వే సప్లిమెంటరీ పరీక్షలు రాసిన గ్రేడ్–2 వీఆర్వోల ఫలితాలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘాన్ని గుర్తింపు సంఘంగా ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వేకి సంబంధించి వీఆర్వోలకు రావాల్సిన రూ.కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కూడా కోరారు. క్షేత్రస్థాయిలో వీఆర్వోలు సెలవులు లేకుండా పని చేస్తున్నారని చెప్పారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురై అనారోగ్యం బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఉద్యోగులపై ప్రజాప్రతినిధుల దాడులు పెరిగాయని, దాడికి పాల్పడినవారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. డీడీవో గ్రేడ్-2లకు తహసీల్దార్లుగా ఉద్యోగోన్నతి ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో సంఘ నేతలు పాల్గొన్నారు.