ఆర్టీసీ ఉద్యోగులకూ జీపీఎస్ అమలు చేస్తామని ఏపీఎస్ ఆర్టీసీ డైరెక్టర్ ఏ రాజారెడ్డి తెలిపారు. డోర్ డెలివరీ మాసోత్సవాల సందర్భంగా శ్రీకాకుళం వచ్చిన ఆయన.. శ్రీకాకుళం ఒకటో నంబర్ డిపోలో ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక కార్మికులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారారన్నారు. త్వరలో వారికీ జీపీఎస్‌ను అమలులోకి తీసుకువస్తామని.. 1,500 డీజిల్, 1,000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఆర్టీసీ ద్వారా అందిస్తున్న కార్గో సేవలను ప్రజలంతా వినియోగించుకోవాలని రాజారెడ్డి కోరారు.
ఆర్టీసీ కార్గో ఆదాయం పెంచేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు రాజారెడ్డి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కార్గో ఆదాయం రూ.240 కోట్లు సాధించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు వివరించారు. విశాఖపట్నంలో ఓడరేవు ఉన్న కారణంగా ఎగుమతులు, దిగుమతులకు అవకాశం ఉంటుందని.. తద్వారా కార్గోకు ఆదాయం పెరిగే ఆస్కారం ఉందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు నిత్యావసర సరకులు సైతం రవాణా చేయాలనే ఆలోచిస్తున్నామన్నారు. అంతేకాదు కార్గో సేవల్ని మరింతగా విస్తరిస్తామన్నారు.