గుంటూరు-గుంతకల్లు మధ్య రెండో రైల్వే లైన్ నిర్మాణం వేగంగా సాగుతోంది. ఈ లైన్‌లో విద్యుదీకరణలో భాగంగా పల్నాడు జిల్లాలోని మునుమాక నుంచి నరసరావుపేట మీదుగా సాతులూరు వరకు 16.6 కి.మీ. లైన్ పూర్తి చేశారు. దీంతో గుంటూరు నుంచి ప్రకాశం జిల్లాలోని జగ్గంబొట్ల కృష్ణాపురం వరకు 176 కి.మీ. రెండో లైన్, విద్యుదీకరణ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. గుంటూరు-గుంతకల్లు మధ్య 401 కి.మీ. మేర రెండో లైన్ నిర్మాణం, విద్యుదీకరణ ప్రాజెక్ట్ 2016-17లో మంజూరైంది. ఇప్పటి వరకు నల్లపాడు-సాతులూరు మధ్య 32 కి.మీ., మునుమాక-జగ్గంబొట్ల కృష్ణాపురం మధ్య 122 కి.మీ., డోన్-గుంతకల్లు మధ్య 68 కి.మీ, బేతంచెర్ల-మల్కాపురం మధ్య 23 కి.మీ. కలిపి 245 కి.మీ. పూర్తి చేశారు. తాజాగా మునుమాక-సాతులూరు మధ్య కూడా రెండోలైన్ పూర్తికావడంతో మొత్తం 261.6 కి.మీ. అందుబాటులోకి వచ్చింది. ఈ మార్గంలో రైళ్ల వేగాన్ని పెంచేందుకు, కొత్త రైళ్లు నడిపేందుకు, రాయలసీమ జిల్లాల నుంచి విజయవాడ, విశాఖ, కోల్‌కతావైపు మరిన్ని రైళ్లు నడిపేందుకు అవకాశం వచ్చిందన్నారు అధికారులు. ఈ మార్గంలో రెండో లైన్ ఏర్పాటు వలన ప్రయాణ సమయం ఎంతో ఆదా అవుతుంది. రాయలసీమకు కూడా ప్రయోజనం.. అలాగే గూడ్సు రైళ్ల ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు. చెన్నై- కోల్‌కతా రైలు మార్గానికి ప్రత్యామ్నాయంగా ఈ లైన్ పని చేస్తుంది. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం నాలుగు జిల్లాల మీదుగా ఇది వెళుతుంది కాబట్టి రైల్వేకు ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి.