నంద్యాల జిల్లాలో దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠా పోలీసులు చేతికి చిక్కింది. వివరాల్లోకి వెళ్ళితే.... నంద్యాల జిల్లా కేంద్రంతోపాటు పాణ్యం, బేతంచెర్ల, డోన్ మండలాల పరిధిలో గత కొన్ని నెలలుగా మోటార్‌సైకిళ్లపై వెళ్లే వాళ్లను అడ్డగించి నగదు, సెల్‌ఫోన్లు, బంగారం, ఇతర విలువైన వస్తువులు దోచుకునేవారని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో షఫీనా జాస్మిన్ ఆమె స్నేహితుడు అనిల్‌కుమార్ మోటార్ సైకిల్‌పై మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో సిమెంట్‌నగర్ నుంచి పాణ్యం వెళ్తుండగా మారణాయుధాలతో బెదిరించి వారి వద్ద నుంచి సుమారు 31గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు వాచీలు, రెండు సెల్‌ఫోన్లు, రూ.5వేల నగదు దోచుకున్నట్లు పాణ్యం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. నంద్యాల పట్టణంలోని చాపిరేవుల టోల్‌గేట్ పరిసర ప్రాంతాల్లో మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న మరొక జంటపై దాడి చేసి వారి నుంచి 4సెల్‌ఫోన్లు, 150గ్రాముల వెండి పట్టీలను లాక్కున్న కేసు కూడా నమోదైంది. తమ్మరాజుపల్లె ఘాట్‌లో వెళ్తున్న ఒక లారీ డ్రైవర్‌ను బెదిరించి అతని నుంచి 5 బియ్యం ప్యాకెట్లు దొంగలించారు. శాంతిరాం కాలేజి పక్కనున్న పొలాల్లో ఉన్న రైతును బెదిరించి అతని వద్ద నుంచి రూ.25 వేల నగదు దోచుకున్నారు. చాపిరేవుల టోల్‌గేట్ సమీపంలో మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను బెదిరించి వారి వద్ద నుంచి రూ.2వేల నగదు లాక్కున్న కేసు నమోదై ఉంది. ఈ దారి దోపిడీ ముఠాలోని ఆరుగురు సభ్యులను సోమవారం నంద్యాల టౌన్ డీఎస్పీ మహేశ్వరరెడ్డి, పాణ్యం సీఐ డి.వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పాణ్యం ఎస్పై పి.అశోక్, గడివేముల ఎస్సై బీటీ వెంకటసుబ్బయ్య, పాణ్యం పోలీస్ సిబ్బంది అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వీరి నుంచి రూ.2.10 లక్షల విలువైన బంగారం, వెండి సొత్తు రికవరీ చేసినట్లు వివరించారు.