కార్లు అద్దెకు తీసుకుని అమ్మేస్తున్న కేటుగాడిని అరెస్ట్ చేశారు పోలీసులు. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం వుయ్యూరిమెరకకు చెందిన బీర కృష్ణంరాజు తాను రియల్‌ఎస్టేట్ వ్యాపారినని కార్లు అద్దెకు ఇచ్చేవారిని పరిచయం చేసుకునేవాడు. వ్యాపారి అని చెప్పడంతో కృష్ణంరాజును నమ్మేవారు. ఆయన నెలపాటు కారు అద్దెుకు తీసుకుని డబ్బులు చెల్లిస్తుండేవాడు. ఆ తర్వాత అసలు డ్రామా మొదలుపెట్టేవాడు. తన కుటుంబసభ్యులకు వైద్యం చేయించేందుకు డబ్బు అత్యవసరమని ఆ కార్లను ఇతరుల దగ్గర తాకట్టు పెట్టేవాడు.
కృష్ణంరాజు ఇలా మాయ మాటలు చెప్పి రావులపాలెంలో మూడు, అనపర్తి మండలం పందలపాకలో రెండు కార్లను తాకట్టు పెట్టాడు. ఆ డబ్బుతో జల్సాలకు వాడుకునేవాడు. కారు అద్దెకు తీసుకుని తాకట్టు పెట్టిన తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేవాడు. ఈ క్రమంలో కార్లను అద్దెకు ఇచ్చే వ్యాపారం చేస్తున్న అబ్బాస్ హైదర్ దగ్గర కూడా కృష్ణంరాజు కారును తీసుకున్నాడు. మూడు నెలలక్రితం తన కారు తీసుకువెళ్లినట్లు అక్టోబరు 29న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి కృష్ణంరాజును అదుపులోకి తీసుకున్నారు. అతడిపై విశాఖపట్టణం-2, పీఎంపాలెం, పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం, నర్సాపురం రూరల్, విజయవాడ సిటీ-2 పోలీస్‌స్టేషన్ల పరిధిలో కూడా కేసులు ఉన్నట్లు గుర్తించారు. అతడి దగ్గర స్వాధీనం చేసుకున్న కార్లను ఆయా పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ఉంచనున్నారు. నిందితుడిని అమలాపురం కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండు విధించారు. కార్లను అద్దెకు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పరిచయం లేని వారకి కార్లను అప్పగించొద్దని చెబుతున్నారు.