గుంటూరులో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్నవారిపై కఠిన చర్యలకు సిద్దమవుతున్నారు పోలీసులు. పదే, పదే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి దొరికిపోతే రౌడీషీట్లు తప్పవని హెచ్చరిస్తున్నారు. నాలుగైదు రోజులుగా వందలమంది మద్యం తాగుతూ పట్టుబడ్డారు. దీంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. గతంలో మద్యం తాగుతూ దొరికి కేసు నమోదు చేసి ఉంటే వెంటనే వారిపై రౌడీషీట్ తెరవాలని ఐజీ జి పాలరాజు ఆదేశించారు.
గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వ్యక్తిగత సెలవులో ఉన్నారు. దీంతో గుంటూరు జిల్లా ఎస్పీ ఇంఛార్జ్ బాధ్యతల్ని ఐజీ పాలరాజు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన రాత్రి పూట నగరంలో పర్యటించారు.. ఆ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ యువకులు కనిపించారు. వీరంతా రాత్రి 9-12 గంటల మధ్య బహిరంగ ప్రదేశాల్లో, రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో కూర్చొని మద్యం తాగుతూ గొడవలు చేస్తున్నారు. కొందరు అక్కడే ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో కంట్రోల్ రూంకు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి 10 గంటల తర్వాత అసలు మద్యం విక్రయాలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టాలని పోలీసుల్ని ఐజీ పాలరాజు ఆదేశించారు. అలాగే 10 గంటల తర్వాత చాలా బార్ అండ్ రెస్టారెంట్లలో ఫుడ్ పేరుతో రాత్రి 11-12 గంటల దాకా మద్యం విక్రయాలు చేస్తున్నారని గుర్తించారు. దీంతో నిబంధనలు పాటించాల్సిందే అన్నారు ఐజీ. ఇలా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిలో మార్పు తేవాలని నిర్ణయించారు ఐజీ. ఒకవేళ వారి ప్రవర్తన బాగుంటే రౌడీషీట్లను తొలగిస్తామన్నారు.
నగరంలో రాత్రి సమయంలో కానిస్టేబుళ్లు గస్తీని పెంచారు. అనుమానిత వ్యక్తులు, నంబరు లేని వాహనాలతో ప్రయాణాలు సాగించడానికి సాహసం చేయరని, ఇలాంటి వాటి వల్ల శాంతిభద్రతలు మెరుగవుతాయి అంటున్నారు. అంతేకాదు ఇటీవల గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ సుప్రజ కూడా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించేవారిపై కేసులు నమోదు చేశారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ఉంటే ఆ సమాచారాన్ని కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన ఫోన్ నంబర్‌కు తెలయజేయాలని ఆదేశించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అడ్మిన్ అడిషనల్ ఎస్పీ సుప్రజ తెలిపారు. మొత్తానికి గుంటూరు పోలీసులు మందుబాబులపై నిఘా పెంచారు.