ప్రస్తుతం రాజకీయాలు అంటేనే ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. ఇక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కోట్లు కుమ్మరిస్తే గానీ గెలవడం అసాధ్యం. కొన్ని చోట్ల డబ్బులు ఖర్చు చేయకపోయినా గెలిచే నేతలు ఉన్నా.. దేశంలో అత్యధిక ప్రాంతాల్లో మాత్రం డబ్బు ఉంటేనే ఓట్లు రాలతాయి. ఇక చాలా మంది డబ్బు ఉన్న వారు కూడా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి దివాళా తీస్తూ ఉంటారు. అయితే ఓ రోజు వారీ కూలీ మాత్రం ఎన్ని ఎన్నికల్లో ఓడిపోయినా పట్టు వదలని విక్రమార్కుడి లాగా మళ్లీ మళ్లీ పోటీకి దిగుతున్నాడు. గత 50 ఏళ్ల కాలంలో 20 సార్లు ఎన్నికల బరిలో నిలిచాడు. అయితే దురదృష్ట వశాత్తు ఒక్క ఎన్నికల్లో కూడా ఆయన గెలవలేదు. పంచాయతీ ఎన్నికల నుంచి మొదలు పెడితే లోక్‌సభ ఎన్నికల వరకు అన్ని రకాల ఎన్నికల్లోనూ ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నించినా.. విజయం మాత్రం అతడిని వరించలేదు.
ఆ పట్టు వదలని విక్రమార్కుడే రాజస్థాన్‌కు చెందిన తీతర్ సింగ్. 1970 లో ప్రారంభమైన అతని ఎన్నికల ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 1970 మొదలు పంచాయతీ ఎన్నికల నుంచి లోక్‌సభ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లో పోటీ చేసినా అపజయమే అతడికి ఎదురైంది. ప్రస్తుతం తీతర్ సింగ్ వయసు 78 ఏళ్లు కాగా.. తాజాగా మరికొన్ని రోజుల్లో జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు. నవంబర్ 25 వ తేదీన రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్న తీతర్ సింగ్.. కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇప్పటివరకు 20 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా మళ్లీ ఎందుకు పోటీ చేస్తున్నారని తీతర్ సింగ్‌ను మీడియా ప్రశ్నించింది. అయితే దానికి ఆయన తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చాడు. ఓటమి పాలైనా తాను మళ్లీ ఎందుకు పోరాడకూడదు అని తిరిగి ప్రశ్నించాడు. ప్రభుత్వం భూమి, సౌకర్యాలు ఇవ్వాలి. ఈ ఎన్నికలు ప్రజల హక్కుల కోసం చేసే పోరాటమే కానీ పాపులారటీ కోసం కాదని తీతర్ సింగ్ స్పష్టం చేశాడు. ఈసారి రాజస్థాన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు త్వరలోనే నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేస్తానని వెల్లడించాడు.
దళిత సామాజిక వర్గానికి చెందిన తీతర్ సింగ్‌కు ముగ్గురు కుమార్తెలు.. ఇద్దరు కుమారులు ఉన్నారు. తన కుమార్తెలు, కుమారులకు పెళ్లిళ్లు అయి.. వారికి పిల్లలు పుట్టారని.. వారికి కూడా పెళ్లిళ్లు అయ్యాయని తెలిపాడు. అయితే తన పేరు మీద ఏ ఆస్తి లేదని.. వాహనాలు కూడా లేవని వెల్లడించాడు. తాను సాధారణంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద రోజువారీ కూలీగా పని చేస్తానని తెలిపాడు. ఇక ఎన్నికలు వచ్చిన వెంటనే ప్రచారం చేయడంపై దృష్టి సారిస్తానని తీతర్ సింగ్ చెప్పాడు. అయితే తాను పోటీ చేసిన ప్రతిసారీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలేదని తెలిపాడు. 2008 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 938 ఓట్లు, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 427, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 653 ఓట్లు తీతర్ సింగ్ సాధించాడు.