నంద్యాల జిల్లాలో వైఎస్సార్‌సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆళ్లగడ్డకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి తన సోదరులతో కలిసి సోమవారం హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు రాంపుల్లారెడ్డి. ఇరిగెల రాంపుల్లారెడ్డి వర్గం 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంది. 1997లో ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో గంగుల కుటుంబం పోటీకి దూరంగా ఉండటంతో ఇరిగెల రాంపుల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల కుటుంబానికి మద్దతు ప్రకటించారు. భూమా నాగిరెడ్డి 2008లో టీడీపీని వీడి ప్రజారాజ్యంలో చేరినప్పుడు ఆ స్థానంలో రాంపుల్లారెడ్డిని చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు సమక్షంలో 2009లో టీడీపీలో చేరి అసెంబ్లీకి పోటీ చేశారు. 2012 ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరడంతో ఇరిగెల సోదరులు పార్టీకి దూరమయ్యారు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్రరెడ్డి గెలుపు కోసం పనిచేశారు. ఇరిగెల సోదరులు రాంపుల్లారెడ్డి, రామచంద్రారెడ్డి, సూర్యనారాయణరెడ్డి, విశ్వనాథరెడ్డి, ప్రతాపరెడ్డి.. జనసేనలో చేరడం ఆళ్లగడ్డ రాజకీయాల్ కీలక మార్పు అంటున్నారు.