వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర పల్నాడు జిల్లా వినుకొండలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, విడదల రజని, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు చంద్రగిరి ఏసురత్నం, జంగా కృష్ణమూర్తి, కుంభా రవిబాబు, పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గుండెల్లో పెట్టుకున్నారని, బడుగు వర్గాలను తలెత్తుకొని జీవించేలా చేశారని నేతలు కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ........ ఇప్పుడు ఎన్నికలు లేవు. జగనన్న ఇక్కడికి రాలేదు. ఆయన బొమ్మ పెట్టుకొని సామాజిక సాధికార యాత్ర చేస్తున్నాం. దేశంలో ఎందరో మహనీయులు సామాజిక విప్లవం రావాలి, దేశం బాగుపడాలి, పేదవారు బాగుండాలని కోరుకున్నారు. ఏ ముఖ్యమంత్రీ ఆ ఆలోచన చేయలేదు. ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను గుండెల్లో పెట్టుకున్నారు. చంద్రబాబు పాలనలో అవమానాలు ఎదుర్కొన్నాం. జగనన్న అలా చూడలేదు. రూ.2.40 లక్షల కోట్లు కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా ఇచ్చారు. పేదవాడి పిల్లలకు ఇంగ్లీషు విద్య అందిస్తున్నారు. పేదవాడు ధైర్యంగా బతికేలా చేశారు. రాష్ట్రంలో పేదరికం 12 శాతం నుంచి 6 శాతానికి తెచ్చారంటే జీవన విధానం పెరిగిందా? తగ్గిందా? అంబేద్కర్ విగ్రహాన్ని బాబు అవమానిస్తే, విజయవాడ నడిబొడ్డున జగనన్న వందల కోట్ల రూపాయలతో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టి అంబేడ్కర్ అంటే తనకు ఎంత గౌరవమో చేతలలో చూపిస్తున్నాడు. మరో అంబేద్కర్, మరో పూలే, మరో జగ్జీవన్ రామ్ జగనన్న అని తెలియజేసారు.