చికున్ గున్యా వ్యాధి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నేళ్ల క్రితం ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసిన ఈ మహమ్మారి బారిన ఏటా కొన్ని లక్షల మంది పడుతూనే ఉన్నారు. ఇక ఈ చికున్ గున్యా సోకిన వ్యక్తికి తీవ్ర జ్వరం, కీళ్ల నొప్పులు భరించలేకుండా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఎప్పుడూ ఒళ్లంతా నొప్పులు ఉంటూనే ఉంటాయి. మరో వ్యక్తి సాయం లేనిదే కనీసం లేవడానికి కూడా ఓపిక ఉండదు. అయితే గత కొన్నేళ్ల నుంచి ఈ సమస్య ఉన్నప్పటికీ.. శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నా ఈ వ్యాధికి ఇప్పటివరకు మందు కనిపెట్టలేదు. కానీ తాజాగా ఒక వ్యాక్సిన్ మాత్రం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా చికున్ గున్యా వైరస్‌కు టీకాను అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్-ఎఫ్‌డీఏ ఆమోదం కల్పించింది. క్లినికల్ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ మంచి ఫలితాలను సాధించినట్లు పరిశోధకులు వెల్లడించారు. దోమల కారణంగా వ్యాపించే ఈ చికున్ గున్యా వ్యాధితో చిన్న పిల్లల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కొన్నేళ్ల క్రితం తీవ్ర ప్రభావం చూపిన ఈ చికున్ గున్యా.. ఇటీవల మళ్లీ వ్యాప్తి చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే తొలిసారి అనుమతి లభించిన ఈ టీకాకు ఎఫ్‌డీఏ అనుమతులు ఇవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.
ఐరోపాకు చెందిన వాల్నెవా అనే కంపెనీ ఇక్స్చిక్ అనే వ్యాక్సిన్‌ను తయారు చేసింది. అయితే ఈ వ్యాక్సిన్‌ను 18 ఏళ్ల వయసు దాటిన వారు మాత్రమే తీసుకోవాలని సూచించింది. అది కూడా ఒకే డోసు తీసుకోవాలని తెలిపింది. ఈ చికున్ గన్యా తీవ్రమైన దీర్ఘకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా పెద్దలు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి ఈ చికున్ గున్యా సోకితే ఎక్కువ సమస్యలు వస్తాయని ఎఫ్‌డీఏ సీనియర్ అధికారి పీటర్ మార్క్స్ తెలిపారు.
ఇప్పటివరకు ఈ చికున్ గున్యా సోకితే తీసుకోవాల్సిన చికిత్సకు సంబంధించి ఖచ్చితమైన మందులు లేవు. ముఖ్యంగా తేమ వాతావరణ పరిస్థితులు ఎక్కువగా ఉండే దక్షిణ అమెరికా, ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లో ఈ చికున్ గున్యా జ్వరాలు తీవ్రంగా వ్యాపిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి అంతం చేయలేనిదిగా మారింది. అయితే గత 15 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల మందికి ఈ చికున్ గున్యా సోకి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా దురద, తలనొప్పి, కండరాల నొప్పులు, కొందరి కీళ్ల నొప్పులు తీవ్రంగా వేధిస్తూ ఉంటాయి. ఇక కీళ్ల నొప్పులు తగ్గేందుకు కొన్ని నెలల నుంచి సంవత్సరాలు పట్టొచ్చని అమెరికా ఎఫ్‌డీఏ వెల్లడించింది. అయితే ఈ చికున్ గున్యా సోకిన వారికి ఎక్కువ విశ్రాంతి, ఫ్లూయిడ్స్ అందించడం.. ఒళ్లు నొప్పులు, జ్వరానికి వాడే మందులు తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు.