ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంక్ల్లో అవుట్ సోర్సింగ్ పద్దతిని నిలిపివేయాలని, తగినన్ని శాశ్వత నియామకాలు చేపట్టాలని ఏఐబీఈఏ డిమాండ్ చేస్తోంది. ఇందుకోసం డిసెంబర్ 4-11వ తేదిల్లో ఆరు రోజుల పాటు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంక్ల్లో సమ్మెకు పిలుపునిస్తున్నామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం తెలిపారు. వివిధ తేదిల్లో ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంక్ ఉద్యోగులు పాల్గొంటారని అన్నారు. డిసెంబర్ 4న పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ల ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొననున్నారు.
డిసెంబర్ 5న బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, డిసెంబర్ 6న కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్లలో, డిసెంబర్ 7న ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్లలో, డిసెంబర్ 8న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉద్యోగులు దేశవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొంటారని వెంకటాచలం తెలిపారు. డిసెంబర్ 11న ప్రయివేటు బ్యాంక్ల్లో అఖిల భారత సమ్మె జరగనుందన్నారు. కొన్ని బ్యాంకులు ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ చేయడం వల్ల దిగువ స్థాయిలో నియామకాలు తగ్గడమే కాకుండా ఖాతాదారుల గోప్యత, వారి డబ్బు ప్రమాదంలో పడుతుందని వెంకటాచలం ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా కొన్ని బ్యాంకులు పారిశ్రామిక వివాదాల (సవరణ) చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయన్నారు. లేబర్ అధికారులు జోక్యం చేసుకున్నప్పటికీ, యాజమాన్యం వారి సలహాను పట్టించుకోవడం లేదన్నారు. నిబంధనలకు విరుద్దంగా ఉద్యోగులను బలవంతంగా బదిలీ చేస్తున్నాయన్నారు.